mt_logo

రాముడిపై భ‌క్తి ఇదేనా? ఖ‌మ్మం దాకా వ‌చ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా భ‌ద్రాద్రి రాముడిని ద‌ర్శ‌నం చేసుకోరా?

పొద్దున లేస్తే.. ఎవ‌రైనా ఫోన్ చేస్తే..ఎవ‌రైనా ఎదురొస్తే బీజేపీ నేత‌లు మొద‌ట ఉచ్ఛ‌రించే ప‌దం జై శ్రీరాం. పార్టీ మీటింగ్‌లు.. ప్ర‌జా బ‌హిరంగ స‌భ‌ల్లో ఇదే నినాదం మార్మోగుతుంది. తామే శ్రీరాముడికి అస‌లు భ‌క్తుల‌మ‌ని చెప్పుకొంటారు. కానీ, బీజేపీకి చెందిన కేంద్ర హోంమంత్రి మాత్రం భ‌ద్రాద్రి రామ‌య్య‌ను ద‌ర్శించుకోకుండా పలాయ‌నం చిత్త‌గిస్తున్నారు. ఖ‌మ్మం జిల్లా కేంద్రంలో నేడు నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌వుతున్న అమిత్ షా.. త‌న భ‌ద్రాద్రి ప‌ర్య‌ట‌న‌ను చివ‌రి నిమిషంలో ర‌ద్దు చేసుకోవ‌డంపై భ‌ద్రాచలం వాసులు  మండిప‌డుతున్నారు. అమిత్ షా మీ రామ‌భ‌క్తి ఇదేనా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ప‌లు స‌మ‌స్య‌ల‌పై తాము నిల‌దీస్తామ‌నే భ‌యంతోనే అమిత్ షా భ‌ద్రాద్రి రాముడి ద‌ర్శ‌నానికి కూడా రావ‌డం లేద‌ని అంటున్నారు. 

అమిత్ షా ప‌ర్య‌ట‌న ర‌ద్దుపై అనుమానాలెన్నో!

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలుగు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న షెడ్యూల్‌ను యంత్రాంగం ప్ర‌క‌టించింది. అమిత్ షా ఆదివారం  ఢిల్లీ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి ఏపీలోని విజయవాడకు చేరుకొంటార‌ని, అక్కడి నుంచి భద్రాచలం వచ్చి అక్కడినుంచి సీతారామచంద్రస్వామి దర్శనం చేసుకుంటార‌ని పేర్కొన్న‌ది. కానీ, భద్రాచలం పర్యటన రద్దయినట్టు శ‌నివారం సాయంత్రం యంత్రాంగం ప్రకటించింది. ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వ‌హించే బహిరంగ సభకు మాత్రమే  అమిత్ షా హాజరవుతున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు సైతం నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉండ‌గా.. వ‌ర‌ద సాయంపై ప్ర‌శ్నిస్తార‌నే భ‌యంతోనే అమిత్ షా భ‌ద్రాద్రి ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకొన్నార‌ని భ‌ద్రాచ‌లం ముంపు బాధితులు పేర్కొంటున్నారు. అలాగే, ఇక్క‌డి గోదావ‌రిపై బ్రిడ్జి, కొవ్వూరు రైల్వేలైన్‌, రాష్ట్ర విభ‌జ‌న హామీలు, విలీన మండ‌లాలు, పంచాయ‌తీల‌పై తాము నిల‌దీస్తామ‌నే అమిత్‌షా ప‌లాయనం చిత్త‌గించార‌ని ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు. రాముడిపై భ‌క్తి ఉంటే భ‌ద్రాద్రి రామ‌య్య‌ను అమిత్ షా క‌చ్చితంగా ద‌ర్శించుకొనేవార‌ని అంటున్నారు.