mt_logo

రంగంలోకి సైబర్ నిపుణులు..!

ఓటుకు నోటు కేసులో ఇకపై కీలకపరిణామాలు చోటు చేసుకోనున్నాయి. కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న ఫోరెన్సిక్ రిపోర్ట్ ను ప్రత్యేక కోర్టు నుండి ఏసీబీ శుక్రవారం స్వీకరించింది. అనంతరం ఏసీబీ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు సమావేశమై రేవంత్ వీడియోతో పాటు చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులకు సంబంధించిన ప్రాధమిక నివేదికపై అర్ధరాత్రి దాకా చర్చలు జరిపారు. ఫోరెన్సిక్ నివేదికలోని అంశాలను విశ్లేషించేందుకు ఏసీబీ మూడు ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందాలను ఏర్పాటు చేసింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక టెక్నికల్ అంశాలతో లింక్ అయి ఉండటంతో దీనిని అధ్యయనం చేసేందుకు సైబర్ నిపుణులను, టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ ను ఏసీబీ రంగంలోకి దించనుంది. వాయిస్ రికార్డ్ కోసం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలేమిటి? ఎవరెవరికి నోటీసులు జారీ చేయాలి? న్యాయపరమైన అంశాలేమిటి? వాయిస్ టెస్ట్ కు రావడానికి ఎవరైనా తిరస్కరిస్తే తీసుకోవాల్సిన చర్యలేమిటి? అన్న విషయాలపై త్వరలోనే ఒక అవగాహనకు వస్తామని ఏసీబీ అధికారులు చెప్పారు.

ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన సీడీలు, హార్డ్ డిస్క్ లను అధ్యయనం చేసేందుకు తమ ప్రత్యేక బృందాలకు కనీసం రెండు రోజులైనా పడుతుందని ఏసీబీకి చెందిన ఒక అధికారి తెలిపారు. అయితే కేసుపై కీలక దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఏ అధికారి అయినా ఎలాంటి సమాచారం గానీ, లేదా లీకులు ఇచ్చినా జైలుకు వెళ్లక తప్పదని, న్యాయపరంగా మరింత లోతుకు ఈ కేసు దర్యాప్తు ఉండటంతో ఇలాంటి సమయంలో మిగతా కేసుల మాదిరిగా వ్యవహరించకూడదని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *