mt_logo

కేటీఆర్ ట్విట్టర్ లైవ్ కు నెటిజన్ల భారీ స్పందన..

సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్ లైవ్ లో శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఐటీ మంత్రి కేటీఆర్ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 80 నిమిషాల్లో 125 ప్రశ్నలు.. సగటున 38.3 సెకన్లకు ఒక ట్వీట్ వచ్చింది. @WEAREHYDERABAD, #AskKTR హ్యాష్ ట్యాగ్ లను ఏర్పాటుచేశారు. #AskKTR హ్యాష్ ట్యాగ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.

ఆంధ్రా ప్రజలపై తమకు ఎలాంటి ద్వేషం లేదని, హైదరాబాద్ నగరంలో శతాబ్దాలుగా అన్ని ప్రాంతాల ప్రజలు నిర్భయంగా కలిసిమెలిసి జీవిస్తున్నారని, వారందరి ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని ఒకరు అడుగగా దానికి సమాధానంగా రాష్ట్రంలో మరో 20 ఏళ్ళు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని కేటీఆర్ స్పష్టం చేశారు. తాను సినిమా ప్రియుడినని, ఎస్ఎస్ రాజమౌళి అద్భుతమైన దర్శకుడని అన్నారు. వాటర్ గ్రిడ్ ను సకాలంలో పూర్తిచేయడం సాధ్యమా? ఎన్నారైలుగా మేం ఎలా సహాయపడగలం అన్న ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ తప్పకుండా పూర్తిచేస్తాం. మీ సహకారాన్ని తీసుకుంటాం అని చెప్పారు.

పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారా అన్న ప్రశ్నకు మా తెలంగాణలో 70 శాతం గోదావరి ప్రవహిస్తున్నది. మిమ్మల్నే ఆహ్వానిస్తున్నామన్నారు. నేను రాయలసీమ వాసిని, వచ్చే జన్మలో తెలంగాణలో పుట్టాలనుకుంటున్నాను అని ఒకరు ట్వీట్ చేయగా మంత్రి థాంక్స్ చెప్పారు. సీఎం కేసీఆర్, మీలాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ కు కావాలి.. ఇక్కడ పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు మంత్రి వెల్ అని సమాధానం చెప్పారు. మీ అభిమాన క్రీడాకారుడు ఎవరని అడుగగా రాహుల్ ద్రవిడ్ అన్నారు. హైదరాబాద్ లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం వల్ల దాదాపు 70 శాతం నేరాలు తగ్గిపోయాయని, ఇంకా మీ ప్రణాళికలు ఏమిటని అన్న ప్రశ్నకు సమాధానంగా లక్ష కెమెరాలు పెట్టాలని నిర్ణయించాం అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *