mt_logo

టెక్ చాంప్స్‌గా తెలంగాణ బిడ్డ‌లు.. స‌ర్కారు బ‌డిలో సాంకేతిక విద్య‌

  • రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా రాజన్న జిల్లాలో ప్రారంభం
  • ఆరు నుంచి పదో తరగతి పిల్లలకు కంప్యూట‌ర్ చాంప్స్‌ శిక్షణ

ఇది సాంకేతిక యుగం..కంప్యూట‌ర్‌పై అవ‌గాహ‌న ఉంటేనే ఏ విద్యార్థి అయినా రాణించ‌గ‌ల‌డు. ధ‌న‌వంతుల  పిల్ల‌ల‌కు సాంకేతిక విద్య అంద‌డం తేలికే.. కానీ స‌ర్కారు బడుల్లో చ‌దివే పిల్ల‌లకు ఇది క‌ష్ట‌సాధ్యం. అందుకే తెలంగాణ స‌ర్కారు స‌రికొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది.ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఐటీ ఆధారిత విద్యపై అవగాహన కల్పించాలని సిరిసిల్ల కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆలోచన చేయగా, మంత్రి కేటీఆర్‌ చొరవతో రాష్ట్రంలోనే ప్ర‌యోగాత్మ‌కంగా ‘కంప్యూటర్‌ చాంప్స్‌’ను  సిరిసిల్ల‌లో ప్రారంభించింది. ప్రధానంగా ఉన్నత పాఠశాలలు, మోడల్‌, కేజీబీవీల్లోని ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నుంచే 45 రోజులపాటు ప్రతి రోజూ రెండు క్లాసుల చొప్పున శిక్షణ ఇవ్వాలని నిర్ణయించి, ఈ మేరకు 61 పాఠశాలలను ఎంపిక చేసింది. ఈ నెల 20న ఎల్లారెడ్డిపేట ఆధునిక పాఠశాలలో అమాత్యుడు కేటీఆర్‌ చేతుల మీదుగా కార్యక్రమానికి అంకురార్పణ చేయగా, మొత్తంగా జిల్లాలో 12,823 మందికి లబ్ధి కలుగబోతున్నది.  

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కార్పొరేట్‌ స్కూల్స్‌ విద్యార్థులతో పోటీ పడే స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా జిల్లాలో సరికొత్త కార్యక్రమం ప్రారంభమైంది. పిల్లలకు ఆధునిక ఐటీ, ఐటీ ఆధారిత విద్యాబోధన అందించి డిజిటల్‌ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి భావించారు. విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ఆయన చొరవతో రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా ‘కంప్యూటర్‌ చాంప్స్‌’కు శ్రీకారం చుట్టారు. ప్రయోగాత్మకంగా ఈ నెల 20వ తేదీనే ఎల్లారెడ్డిపేట ఆధునిక పాఠశాల సముదాయంలో ప్రారంభించారు. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుండగా, పిల్లల తల్లిదండ్రులు సంబరపడుతున్నారు.

ఆరు నుంచి పదో తరగతి దాకా..

డిజిటల్‌ అక్షరాస్యత కోసం జిల్లాలో ప్రభుత్వ ఉన్నత, మోడల్‌, కస్తూర్బా విద్యాలయాలు కలిసి మొత్తం 60 స్కూళ్లను విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారు. ఇందులో ఆరు నుంచి పదో తరగతి దాకా 12,823 మంది అభ్యసిస్తున్నారు. వీరికి డిజిటల్‌ లిటరసీలో భాగంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వారానికి రెండు తరగతుల చొప్పున ప్రతి నెలకు వీలును బట్టి 7-8 క్లాసులు నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రణాళిక రచించింది. ఈ విద్యాసంవత్సరం పూర్తయ్యే నాటికి సుమారు 45 క్లాసుల్లో కంప్యూటర్‌ బేసిక్స్‌పై సంపూర్ణ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పిల్లల కోసం ప్రత్యేకంగా బిట్స్‌ అండ్‌ బైట్స్‌ అనే పుస్తకాలను తయారు చేయించి ఇవ్వనున్నారు. శిక్షణ కాలంలో ప్రతి నెలా పరీక్షలు నిర్వహించి అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేసి, వెనుకబడిన విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందిస్తూ ముందుకు వెళ్లనున్నారు. ఆయా పాఠశాలల్లో అవసరమైన చోట కంప్యూటర్‌ ల్యాబ్‌, ఇతర మౌలిక సదుపాయాల రూపకల్పనకు మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ సమకూర్చనున్నారు.

జేఎన్టీయూ కాలేజీ సహకారంతో..

ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిశోధనా రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ కంప్యూటర్‌ రంగంలో ముందున్న జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ) సహకారంతో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి.. జేఎన్టీయూ అధికారులతో చర్చించి కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రూపకల్పన చేశారు. ఇందులో ఎంపిక చేసిన స్కూళ్ల నుంచి 60 మంది ఉపాధ్యాయులకు జేఎన్ టీయూ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఒక రోజు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరు ఆయా స్కూళ్లలో క్లాసులు చెప్పనున్నారు. అయితే వీరితోపాటు జేఎన్టీయూ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు సైతం క్లాసులు చెబుతారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఏమేం చెబుతారు..?

డిజిటల్‌ అక్షర్యాసతలో భాగంగా ఆరు నుంచి పదో తరగతి పిల్లలకు కంప్యూటర్స్‌ బేసిక్స్‌పై అవగాహన కల్పిస్తారు. విద్యార్థులు కంప్యూటర్‌పై పట్టు సాధించేలా ఎంఎస్‌ ఆఫీస్‌ లోని ఎంఎస్‌ వర్డ్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, ఎంఎస్‌ పవర్‌పాయింట్‌, ఇంటర్‌నెట్‌ సాయంతో ఈ మెయిల్‌ క్రియేషన్‌, ఫొటో షాప్‌, ఫండమెంటల్స్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ హిస్టరీ, పెయింటింగ్‌, నోట్‌ప్యాడ్‌ అండ్‌ టైపింగ్‌ ప్రాక్టీస్‌, ఎమ్మెస్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌, ఇంటర్నెట్‌ ఆపరేషన్‌ సైబర్‌ సెక్యూరిటీ తదితర అంశాలు, విద్యార్థుల మానసిక స్థాయిని బట్టి సీ లాంగ్వేజ్‌ను నేర్పించేలా కోర్సును రూపొందించారు. అందుకు సంబంధించిన ఒక సెట్‌లో పది పుస్తకాలు ఉండగా రెండు సెట్లను సైతం పాఠశాలలకు అందించారు.