mt_logo

రైతు బంధు మరియు రైతు బీమా పథకాలు కావాలి… తమిళనాడు రైతుల డిమాండ్‌

రైతుల పెట్టుబడి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నదని.  రైతుకు పంట సమయంలో పెట్టుబడి తెచ్చుకొని అప్పుల పాలయ్యే క్షోభను తప్పించి ప్రభుత్వమే పంటసాయం అందిస్తున్నదని, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఏ ప్రభుత్వమూ రైతు పక్షాన నిలబడి ఇంత గొప్ప నిర్ణయం తీసుకోలేదని. అలాంటి  తెలంగాణా గొప్ప రైతు పథకాలైనా రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24/7 ఉచిత విద్యుత్, నీటిపారుదల, ఆహార ధాన్యాల సేకరణను ఎంఎస్‌పితో అమలు చేయాలని తమిళనాడు రైతులు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం తమిళనాడు రైతు దినోత్సవం సందర్భంగా కృష్ణగిరి జిల్లా కేంద్రంలో తమిళ వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు.

ప్రతి సంవత్సరం జూలై 5న “తమిళనాడు రైతు దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. ఈసారి రైతులు తమిళనాడు జిల్లా కేంద్రమైన కృష్ణగిరిలో జరుపుకున్నారు. తమిళ అగ్రికల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన తమిళ అగ్రికల్చర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఎం.రామ గౌండర్, దక్షిణ భారత రైతు సంఘ సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహ నాయుడు, కర్ణాటక రాష్ట్ర రైతు సంఘాల అధ్యక్షుడు కె.శాంత కుమార్‌లు రైతుల డిమాండ్లను లేవనెత్తారు. ర్యాలీలో ప్రసంగించిన రైతులు, ఇతర వక్తలు తెలంగాణ మోడల్ అభివృద్ధిని తమిళనాడులో పునరావృతం చేయాలని డిమాండ్ చేశారు.

1973 నుండి క్రియాశీలంగా ఉన్న తమిళనాడు వ్యవసాయ రైతుల సంఘం 20 జిల్లాల్లో 1000కి పైగా శాఖలు, లక్షలాది మంది సభ్యులు ఉన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కోటపాటి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఎన్‌డిఎ ప్రభుత్వం హామీ ఇచ్చింది, అయితే అది రైతుల పంట పెట్టుబడిని రెట్టింపు చేసింది. అంతేకాదు విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించాలని కేంద్రం కోరింది. మరోవైపు తెలంగాణలో రైతుల జీవితాలను బాగు చేసేందుకు అనేక మౌలిక సదుపాయాలు, పెట్టుబడి సాయం, రూ.5 లక్షల బీమా అందించామని, పండించిన ప్రతి బస్తాను ప్రభుత్వం ఎంఎస్‌పీ చెల్లించి కొనుగోలు చేస్తుందన్నారు.