
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఊదుగాలదు.. పీరిలేవదు.. అన్న చందంగా తయారైంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారును గద్దెదించి, తాము అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న ఆ పార్టీ ఇప్పటివరకూ అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితానే ప్రకటించలేదు. ఇటీవల ఆయా స్థానాల్లో పోటీకి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్‌కు సొంత పార్టీ నేతలనుంచే షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఒక్కో స్థానానికి నలుగురు, ఐదుగురు దరఖాస్తు చేసుకోగా.. లోకల్‌గా ఎవరికివారే రసరంజు రాజకీయం నడుపుతున్నారు. టికెట్ తమకే వస్తుందంటూ ఊదరగొడుతూ సొంత పార్టీ నేతలపైనే బురదజల్లుతూ తమ పట్టుకోసం ప్రయత్నిస్తుండడం కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పిగా మారింది. అధికారం అటుంచి.. టికెట్ల కేటాయింపుతోనే కాంగ్రెస్ పార్టీ ఖతమైపోతుందనే చర్చ నడుస్తున్నది. ఇదిలా ఉండగా, అభ్యర్థులను రాష్ట్రంలో ఎంపిక చేసుకొనే సత్తాలేని పార్టీకి తాము ఎలా ఓటేస్తామని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ పార్టీ ఢిల్లీకి గులాము అని, ఏ పని కావాలన్నా స్థానిక నాయకులు అధిష్ఠానం ఎదుట మోకరిల్లాల్సిందేనని అంటున్నారు.
ఢిల్లీ చెప్పనిదే అభ్యర్థులనూ ప్రకటించరా?
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకుగానూ 115 స్థానాల్లో బరిలో నిలిచే వారి పేర్లను ప్రకటించింది. గులాబీ శ్రేణులు ఎలక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. కానీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సవాల్ విసిరిన టీపీసీసీ చీఫ్ రేవంత్ మాత్రం అభ్యర్థుల ఎంపికలో తత్తరపాటుకు గురవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు పోటీచేస్తారో అనేది ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉండడంతో జాబితా కోసం వేచిచూస్తున్నారు. అధిష్ఠానం చెప్పనిదే ఏ పనీ చేయం అని అభ్యర్థుల ప్రకటన సందర్భంగానే ప్రజల కళ్లకుగడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వద్ద తాకట్టుపెడుతున్నారు. తాజాగా, కర్ణాటకలో డీకే శివకుమార్‌ను రేవంత్ కలవడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సొంతంగా రాజకీయాలు నెరపడం చాతకావట్లేదని, అందుకే ఢిల్లీ, గల్లీ వయా బెంగళూరు మీదుగా రాజకీయం నడిపేందుకు ఎత్తులు వేస్తున్నదనే ప్రచారం నడుస్తున్నది. తమకు ఢిల్లీ, బెంగళూరు గల్లీల్లో రాజకీయాలు నడిపే పార్టీలు వద్దని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గడ్డమీద చాటే బీఆర్ఎస్ వెంటే ఉంటామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.