వచ్చేనెల ఐదవ తేదీనుండి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ బుధవారం సాయంత్రం దిగ్విజయ్ సింగ్ తో సమావేశమయ్యారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చకు గడువు పెంచమని సీమాంధ్ర నేతలు కోరడాన్ని మధుయాష్కీ ప్రస్తావించగా ‘చర్చకు మరో వారం రోజులు గడువు పెంచినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఫిబ్రవరిలో జరిగే పార్లమెంటు సమావేశాల్లోనే టీ బిల్లు ఆమోదించబడుతుంద’ని డిగ్గీరాజా భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఏఐసీసీ అధినేత సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటమీద నిలబడ్డారని, తెలంగాణ రావడం ఖాయమని కూడా దిగ్విజయ్ అన్నట్లు మధుయాష్కీ మీడియాకు తెలిపారు.