mt_logo

నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై  కఠిన చర్యలు : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: వానాకాలం సాగుకు అందుబాటులో విత్తనాలు, విత్తన నియంత్రణ,  నకిలీ విత్తనాలను అరికట్టేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన డీజీపీ అంజనీ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. 

తొమ్మిదేందల్లో వ్యవసాయరంగంపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాలా రూ.4.50 లక్షల కోట్లు.  దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో ఒక రంగం మీద ఇంత భారీగా ఏ ప్రభుత్వం ఖర్చు చేయలేదు. తెలంగాణలో వ్యవసాయానికే తొలిప్రాధాన్యం ఉందన్నారు మంత్రి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి మూలంగా దేశంలో తెలంగాణ వ్యవసాయ రంగానికి ప్రత్యేక గుర్తింపు, వ్యవసాయ రంగం బలోపేతం మూలంగానే సర్వతోముఖాభివృద్ధి అన్నది కేసీఆర్ ఆలోచన. వ్యవసాయ రంగం నుండి లభించే విస్తృతమైన ఉపాధి మరే రంగం కూడా ఇవ్వలేదు. ఆ ప్రాధాన్యతను గుర్తించే తెలంగాణ ప్రభుత్వం గత 9 ఏళ్లలో ఉచిత కరంటు, పంటల కొనుగోళ్లు, రైతుబంధు, రైతుభీమా, సాగునీరు, విత్తనాలు, ఎరువుల సబ్సిడీ, వ్యవసాయ యాంత్రీకరణ, పంటల మార్పిడి వంటి వాటికి తెలంగాణ ప్రభుత్వం రూ.4.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని,  దేశంలో మనకన్నా విస్తీర్ణంలో, జనాభాపరంగా పెద్దవైన రాష్ట్రాలు ఏవీ ఇంత ఖర్చు పెట్టలేదు. తెలంగాణ ప్రభుత్వ 9 ఏళ్ల కృషికి క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. 

పల్లెసీమలు బాగుపడ్డాయి .. ప్రజల చేతికి పని వచ్చింది .. వ్వవసాయ ఉత్పత్తులు, ఉత్పాదకత పెరిగి  గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యింది, భిన్న వృత్తులు, ఉపాధులు బలపడి సమగ్రమైన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నది .. అన్నింటికీ వ్యవసాయమే మూలాధారమని, వ్యవసాయం బాగుండాలంటే రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికతో వ్యవహరిస్తున్నాం.. ఈ వానాకాలానికి పత్తి, మిరప, కందులు, వరి మిగిలిన అన్ని రకాలు కలిపి 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనా,  పోటీ ప్రపంచంలో విత్తనాల తయారీలో ప్రైవేటు కంపెనీలదే పైచేయిగా ఉంది .. వాటిని నియంత్రించే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది.  నకిలీ విత్తనాల బెడద సంపూర్ణంగా నివారించబడాలి, నకిలీ విత్తనాలు సరఫరా చేసే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు .. గతంతో పోలిస్తే నకిలీ విత్తనాలు దాదాపు కనుమరుగయ్యాయి. ఈ విషయంలో టాస్క్ ఫోర్స్, వ్యవసాయ శాఖ సమన్వయంతో పనిచేయాలి అన్నారు. 

నకిలీ విత్తనాలను అరికట్టే ప్రయత్నంలో అమాయకులను బలి చేయవద్దు .. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి,  కర్ణాటక, కర్నూలు, గద్వాల వైపు నుండి, గుంటూరు, ప్రకాశం వైపు నుండి, అసిఫాబాద్, బెల్లంపల్లి వైపు నుండి, గుజరాత్ వైపు నుండి జహీరాబాద్ మీదుగా వచ్చే దారులపై నిఘా ఉంచాలన్నారు. ప్రధానంగా గుజరాత్, ఆంధ్రాల నుండి నకిలీ విత్తనాల బెడద ఉన్నది .. గత కొన్నేళ్లుగా ఈ విషయం రుజువు చేస్తున్నది, హెచ్ టీ పత్తి విత్తనాల విషయంలో రైతులను చైతన్యం చేయాలి,క్షేత్రస్థాయిలో కనిపించే చిన్న, చిన్న లోపాలు, తప్పిదాలపై కఠినంగా వ్యవహరించకుండా ట్రేడర్లు, విత్తన వ్యాపారులకు సమయం ఇచ్చి సరి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి, దేశంలో అవసరమైన 60 శాతం విత్తనాలను తెలంగాణ అందిస్తున్నది .. ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని వ్యవసాయ శాఖా మంత్రి పేర్కొన్నారు.