mt_logo

కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా మారిపోయింది: శ్రీనివాస్ గౌడ్

షాద్‌నగర్‌లో దళిత మహిళను పోలీసులు హింసించిన తీరు చాలా దారుణమని.. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా మారిపోయింది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు అడుగంటాయి.. ప్రజలు భయం గుపిట్లో బతుకుతున్నారు అని అన్నారు.

కేసీఆర్ హయాంలో తెలంగాణ మహిళలకు సురక్షిత ప్రాంతంగా ఉండేది. శాంతిభద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా ఉండేది. ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా మారిపోయింది అని విమర్శించారు.

షాద్‌నగర్‌లో దళిత మహిళను పోలీసులు హింసించిన తీరు చాలా దారుణం దళిత మహిళను బట్టలు విప్పి కొట్టే పరిస్థితికి తెలంగాణ చేరుకుంది. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు.. మగ పోలీసులతో ఓ మహిళను విచారించడమా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో నేరాల రేటు 9% పెరిగిపోయింది. ముఖ్యమంత్రే హోం మంత్రిగా ఉన్నారు.. ఏం సమాధానం చెబుతారు. సీఎం శాంతి భద్రతలపై సమీక్షి చేయడం లేదా? రాష్ట్రంలో మానభంగాలు, దొంగతనాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోయాయి. నేరాల రేటు పెరిగితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి అని అడిగారు.

శాంతిభద్రతలపై దృష్టి పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని వేధిస్తోంది. సీఎంకు సమయం లేక పోతే హోం శాఖ భాద్యతలు వేరే వారికి అప్పజెప్పాలి. శాంతిభద్రతలు అదుపు తప్పితే రాష్ట్రం ఎవరి చేతిలో ఉండదు అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

తెలంగాణ తెచ్చుకున్నది నేరాల రేటు పెంచుకోవడానికి కాదు.. నేరాలు పెరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మహిళలకి కావాల్సింది ఆత్మగౌరవం, రక్షణ. కేవలం ఫ్రీ బస్ సౌకర్యం ఇచ్చినంత మాత్రానా మహిళలకు రక్షణ ఇచ్చినట్టు కాదు. శాంతిభద్రతల విషయంలో ఏ వర్గం రాష్ట్ర ప్రభుత్వం పట్ల సంతోషంగా లేదు అని తెలిపారు.

కక్ష సాధింపుల కోసం పోలీసులను వాడుకుంటున్నారు. హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కోల్పోక ముందే శాంతి భద్రతలపై ప్రభుత్వం కళ్ళు తెరవాలి. షాద్‌నగర్ ఘటనలో సీఐని సస్పెండ్ చేసినంత మాత్రాన దళిత మహిళకు న్యాయం జరగదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.

హాస్టళ్లలో విద్యార్థులు పురుగుల అన్నం తినే పరిస్థితి రావడం దారుణం. యూనివర్సిటీల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతోంది. తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాలపాలు చేస్తోంది అని ధ్వజమెత్తారు.

పేద వర్గాల పట్ల చిన్న చూపు ప్రభుత్వ విధానమా.. ఇది పేదల ప్రభుత్వమా.. పెత్తందార్ల ప్రభుత్వమా? దళితులపై ఇక ముందు ఎలాంటి దాడులు జరగవని ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు.

అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే సాటి ఎమ్మెల్యేల తోలు తీస్తామంటున్నారు.. ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుంది? మహిళలపై దాడులకు దిగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్‌లో నేరాలు చేసేవారు అదుపులో ఉంటారు. శాంతిభద్రతలు అదుపులో పెట్టకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు.. మహిళలు పోలీస్ స్టేషన్ వెళ్లాలంటే భయపడే పరిస్థితి తీసుకురావొద్దు అని శ్రీనివాస్ గౌడ అన్నారు.