mt_logo

తెలంగాణ పాడి రైతులను ఖతం చేసే కుట్ర జరుగుతుంది: శ్రీనివాస్ గౌడ్

రాష్ట్రంలో హాస్టళ్లు, యూనివర్సిటీల్లో, గురుకులాల్లో పరిస్థితి ఘోరంగా ఉందని.. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఎవ్వరూ ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేరని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వం మీద పోరాట కార్యాచరణ ప్రకటించబోతున్నారు అని తెలిపారు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పాల రైతులు రాష్ట్రంలో పరేషాన్‌లో ఉన్నారు.. గతంలో పాడి పంటలు అనేవారు.. ఇప్పుడు పాడి, పంట వేర్వేరు అయ్యాయి అని అన్నారు.

రైతుకు వ్యవసాయానికి పాడి తోడయ్యేది.. రాష్ట్రంలో నాలుగు నెలలైనా పాడి రైతులు పాలు పోస్తున్నా డైరీ డబ్బులు ఇవ్వడం లేదు. హైదరాబాద్‌లో 30 లక్షల లీటర్ల పాలు ప్రతి రోజూ వినియోగిస్తారు. ఐదు లక్షల లీటర్లు తెలంగాణ నుంచి వస్తాయి.. ఈ ఐదు లక్షల లీటర్లకు కూడా పాడి రైతులకు డబ్బులు చెల్లించడం లేదు.. మిగతా 25 లక్షల లీటర్ల పాలు ఎక్కడ్నుంచి వస్తున్నాయి అని అడిగారు.

తెలంగాణ డైరీని బొంద పెట్టి ఆంధ్రా డైరీలను పెంచి పోషించే కుట్ర జరుగుతుందా అనే అనుమానం వస్తోంది. కేసీఆర్ హయాంలో పాడి రైతులకు లీటర్‌కు నాలుగు రూపాయలు ప్రోత్సాహకం ఇచ్చేవారు.. దానాకు డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు పాడి రైతులకు వాళ్ళు పోసిన పాలకు డబ్బులు ఇవ్వడం లేదు అని ఆరోపించారు.

విజయ డైరీలో 500 కోట్ల మేర పాల ఉత్పత్తులు నిల్వ ఉన్నాయి.. వాటిని కనీసం యాదాద్రి దేవస్థానానికో తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికో విక్రయిస్తే బాగుంటుంది. త్వరలో వాటి గడువు దాటితే రూ. 500 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి అని తెలిపారు.

హైదరాబాద్‌లో 30 లక్షల లీటర్ల పాలు అవసరం ఉంటే రైతుల నుంచి ఐదు లక్షల లీటర్లే సేకరిస్తున్నారు.. ఈ ఐదు లక్షల లీటర్లలో కూడా కోత పెట్టాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. తెలంగాణ పాడి రైతులను ఖతం చేయాలని కుట్ర జరుగుతోంది. మొత్తం 30 లక్షల లీటర్ల పాలు ఎవరెవరు సరఫరా చేస్తున్నారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలి ఆని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

రైతులు పాడి పరిశ్రమ నుంచి వైదొలిగి వలస కూలీలుగా పొట్ట చేతిన పట్టుకుని వెళ్లే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తోంది. 50 లక్షల లీటర్ల పాలు తెలంగాణకు అవసరం అవుతాయి.. పాల ఉత్పత్తి పెంచాలి తప్ప తగ్గించకూడదు. పాడి రైతులకు ఇవ్వాల్సిన నాలుగు నెలల బకాయిలు పదిహేను రోజుల్లోగా చెల్లించాలి.. లేదంటే పాడి రైతులతో కలిసి ఉద్యమిస్తాం అని హెచ్చరించారు.

నేను పాడి రైతుగా మాట్లాడుతున్నా.. దయచేసి పాడి పరిశ్రమను రాజకీయాలకు తావు ఇవ్వకుండా బతికించండి. పాల ఉత్పత్తిని తగ్గిస్తే కల్తీ పాలు మార్కెట్లో విచ్చలవిడిగా వస్తాయి.. ఇప్పటికే కల్తీ పాల విక్రయంపై మీడియాలో కథనాలు వస్తున్నాయి అని ఆక్షేపించారు.

కేసీఆర్ హయాంలో పాడి రైతులకు పదిహేను రోజులకు ఓసారి డబ్బులు చెల్లించే విధానం ఉండేది.. అప్పుడు పాల ఉత్పత్తి పెంచమంటే ఇపుడు తగ్గించమంటున్నారు. ఆంధ్రా డైరీలకు పెద్దపీట వేసి విజయ డైరీని తొక్కే కుట్ర జరుగుతోంది అని అన్నారు.

తెలంగాణ నుంచి ఐదు లక్షల లీటర్లే పాలు సేకరిస్తున్నప్పుడు మిగతా పాలు దేంతో తయారు చేస్తున్నారో ఆలోచించాలి.. ఏ రాష్ట్రానికి సరిపడా పాలు అందించే స్థితిలో పాడి రైతులు లేనపుడు ఉత్పత్తి తగ్గించమని ఎలా అంటారు? ఇది ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన అంశం.. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించాలి అని శ్రీనివాస్ గౌడ్ కోరారు.