mt_logo

ఉప్పల్‌ స్కైవాక్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. దీనిని అధిగమించేందుకు నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేని రోడ్లకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల రహదారులు కలిపి 9204 ల‌కు పైగా కిలోమీటర్లు ఉన్నాయి. ఈ రోడ్లపై ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి వ్యూహాత్మక ర‌హ‌దారుల అభివృద్ధి (SRDP) వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టి, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించడంతో చాలావరకు ట్రాఫిక్ సమస్యలకు విముక్తి కలిగింది.

హైదరాబాద్‌లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్‌ చౌరస్తాలో పాదచారులకు ఇబ్బందులు తప్పనున్నాయి. పాదచారులు రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్‌ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ ఈ రోజు ఉదయం ప్రారంభించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రూ.36.50 కోట్ల వ్యయంతో హెచ్‌ఎండీఏ దీనిని నిర్మించింది. ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా.. అటు నుంచి ఇటు వైపు.. ఇటు నుంచి అటు వెళ్లేందుకు వీలుగా 36 పిల్లర్లతో  665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్‌ వెడల్పు, ఆరు మీటర్ల ఎత్తులో బస్టాపులు, మెట్రోస్టేషన్‌ను కలుపుతూ.. ఈ స్కైవాక్‌ను నిర్మించారు. 6 చోట్ల స్కైవాక్ ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా  8 చోట్ల లిఫ్ట్‌లు,4 ఎస్కలేటర్స్‌ మెట్ల సౌకర్యాన్ని కల్పించారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీసు స‌మీపంలోని వ‌రంగ‌ల్ బ‌స్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేష‌న్, ఉప్పల్ ఎల‌క్ట్రిక‌ల్ స‌బ్‌స్టేష‌న్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే భేతి సుభాష్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

స్కైవాక్‌ ప్రత్యేకతలివీ..

• నిర్మాణ వ్యయం: రూ.25 కోట్లు

• పొడవు: 660 మీటర్లు

• నిధులు:  రాష్ట్ర ప్రభుత్వం నుంచి

•వెడల్పు: 3, 4, 6 మీటర్ల చొప్పున

• ఉప్పల్‌ మెట్రో రైలు స్టేషన్‌లోకి అనుసంధానం

• మెట్రో స్టేషన్‌ నుంచి నిత్యం ప్రయాణించే వారు: 25-30 వేల మంది

• పాదచారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నడక సాగించే వీలు

• రింగు రోడ్డులో రాకపోకలు సాగించే పాదచారుల సంఖ్య: సుమారు 20 వేలు