mt_logo

రైతుబంధు, రైతుభరోసా ఎగ్గొట్టి రుణమాఫీ అంటూ మోసం చేస్తున్నారు: నిరంజన్ రెడ్డి

రుణమాఫీపై తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద పాల్గొన్నారు. కాంగ్రెస్ పై రైతులకు ఉన్న భ్రమలు తొలిగాయి అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ రైతుబంధు, రైతుభరోసా గుండుసున్నా.. మహిళలకు రూ. 2,500 గుండుసున్నా.. ఫించన్ రూ. 4,000 గుండు సున్నా.. రైతుభరోసాపై క్యాబినెట్‌లో ఎందుకు చర్చించలేదు ? శాసనసభలో ఎందుకు ప్రకటించలేదు అని ప్రశ్నించారు.

అరకొరగా రుణమాఫీ చేసి అంతా అయిపోయిందని భ్రమింపచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్ల కోసం రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ హోల్‌సేల్‌గా అబద్ధాలు చెప్పింది. రూ. 2 లక్షల రుణమాఫీ డిసెంబరు 9 నాడే చేస్తామని ప్రగల్భాలు పలికారు. రూ. 40 వేల కోట్లు అన్నారు.. రూ. 31 వేల కోట్లకు ప్రకటనలు ఇచ్చారు.. చివరకు 11.20 లక్షల మందికి రూ. 6 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు అని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో రైతుల సంఖ్య పెరుగుతుంది.. కానీ తరగదు.రైతుబంధు తీసుకున్న రైతుల ఖాతాలు 69 లక్షలు ఉన్నాయి.. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలివిడతలో 39 లక్షల మంది రైతుల రుణాలు రూ. లక్ష వరకు మాఫీ చేసింది. రెండో విడతలో రూ. 19 వేల కోట్లకు గాను రూ. 13 వేల కోట్ల రుణమాఫీ చేశాం అని నిరంజన్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో రూ. లక్ష వరకు రుణం తీసుకున్న రైతుల సంఖ్య 40 నుండి 45 లక్షల మంది వరకు ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు విడతల రుణమాఫీలో చూయిస్తున్న రైతుల సంఖ్య 17 లక్షల పైచిలుకు మాత్రమే.. రైతుల సంఖ్య తగ్గిపోవడంలో అంతర్యం ఏమిటి.. రైతుల వివరాలను వెల్లడించకుండా గోప్యంగా ఉంచడంలో మతలబేంటి అని అడిగారు.

రెండు విడతలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ మొత్తం కేవలం రూ. 12 వేల కోట్ల పైచిలుకు మాత్రమే. కేసీఆర్ హయాంలో  రైతుబంధు కింద ఒక్క విడతలో ఇచ్చే మొత్తమే రూ. 7,500 కోట్లు . కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రకారం రైతుభరోసా కింద రైతులు, రైతుకూలీలు, వ్యవసాయ కూలీలకు ఇవ్వాల్సింది రూ. 30 వేల కోట్లు. రైతుబంధు, రైతుభరోసా ఎగ్గొట్టి రుణమాఫీ అంటూ మోసం చేస్తున్నారు అని ధ్వజమెత్తారు.

ఒక్కొక్క విడత రుణమాఫీకి 100, 200 కోట్ల పత్రికా ప్రకటనలు విడుదల చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రకటనలు ఇస్తామంటే ప్రభుత్వం తరపున వద్దు అనవసర వ్యయం అంటూ కేసీఆర్ గారు వారించేవారు. ఇప్పుడు ఇంత ఇచ్చాం.. మిగతాది ఇప్పుడు ఇస్తాం అని ప్రభుత్వం ఒక ప్రకటన ఎందుకు చేయడం లేదు? ఏదీ ఇవ్వకముందే ప్రకటనలు, సంబరాలు చేస్తున్నారు అని అన్నారు.

గ్రామాలలో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ పడిగాపులు గాస్తున్నారు. చిన్న, చిన్న కారణాలతో రైతుల రుణమాఫీకి నిరాకరిస్తున్నారు.. రైతులు సెల్ఫీ వీడియోలు తీసి పెట్టి తమ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాదార్ పాస్‌బుక్ ఉంటే రుణమాఫీ అని సీఎం చెబుతున్నాడు.. పట్టాదార్ పాస్‌‌బుక్ ఉండి రుణమాఫీ కానీ వాళ్లపై చర్చకు ప్రభుత్వం సిద్ధమా అని సవాల్ విసిరారు.

రైతులు బాగుండాలి అన్న సంకల్పంతో వ్యవసాయ రంగం బలోపేతం కోసం కేసీఆర్ గారు పనిచేశారు. పట్టాదార్ పాస్‌బుక్ ఉండి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ కానీ రైతులకోసం తెలంగాణ భవన్‌లో ఓ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. 8374852619 వాట్సప్ నంబర్‌కు రుణమాఫీ కానీ రైతులు తమ వివరాలు పెడితే దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రుణమాఫీ కానీ రైతులకు సాయం అందిస్తాం.. ఎప్పుడు ఇద్దరు నిపుణులు ఈ కాల్ సెంటర్‌లో అందుబాటులో ఉంటారు అని తెలిపారు.

దశాబ్దాల పాటు ప్రాజెక్టులు కట్టకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగాన్ని గోస తీయించింది.. కాంగ్రెస్ పార్టీ హయాంలో పడ్డ కష్టాల నుండి బయటపడేసేందుకు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రుణమాఫీ చేశారు. నమ్మిన రైతాంగాన్ని కాంగ్రెస్ అత్యంత తక్కువ సమయంలో మోసం చేసింది అని నిరంజన్ రెడ్డి విమర్శించారు.