mt_logo

పాలమూరుకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్ పార్టీ: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. నాలుగు నెలలకే రేవంత్ కండ్లు నెత్తికెక్కాయ్.. నాలుక మందమెక్కి కన్నుమిన్ను కానరాక నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నడు. పాలమూరుకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు.

నాలుగున్నర దశాబ్దాలు పాలించి పాలమూరును వలసల జిల్లాగా చేసింది.. 14 లక్షల మంది వలసలకు కారణం అయింది. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి జూరాల, కేఎల్ఐ కింద 13 వేల ఎకరాలు మినహా ఉమ్మడి పాలమూరులో ఎక్కడా సాగునీళ్లు ఇచ్చింది లేదు. 2006లో జొన్నలబోగుడ, గుడిపల్లి రిజర్వాయర్లు పూర్తయితే 2014 వరకు వాటిని గాలికి వదిలేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.

2014లో అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పాలమూరు జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీళ్లు అందించిన ఘనత కేసీఆర్ గారిది. జూరాల నిర్మాణం తర్వాత దాని ఆయకట్టు కింద పూర్తి స్థాయిలో చివరి భూముల వరకు సాగునీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని గుర్తు చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను తానొచ్చిన మూడు నెలలలో భర్తీ చేశానని చెప్పుకోవడానికి రేవంత్‌కు సిగ్గుండాలి.. నిరుద్యోగులు నవ్వుకుంటారు అన్న సోయి కూడా లేదు. కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడిన అంశాన్ని కూడా రాజకీయం చేస్తూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అమర్యాదగా, అగౌరవంగా మాట్లాడడం రేవంత్‌కే చెల్లింది అని విమర్శించారు.

నడమంత్రపు సిరి నరాల మీద పుండు మాదిరిగా రేవంత్‌కు అనుకోకుండా దక్కిన ముఖ్యమంత్రి పదవి ఒక్క పట్టాన ఉండనియ్యడం లేదు. 20 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉండిపోయిన విషయం గుర్తుంచుకోవాలి . నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. అంతమాత్రాన పార్టీలు ఖాళీ కావు. స్వయంగా రేవంత్ నాలుగు పార్టీలు మారాడు.. మరి ఆ పార్టీలు ఖాళీ అయ్యాయా? అని ప్రశ్నించారు.

పాలమూరు పచ్చబడ్డదే కేసీఆర్ గారి హయాంలో.. కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది అని జనాలు గ్రామాలలో మొత్తుకుంటున్నారు. మల్కాజ్‌గిరి నుండి పోటీ చేద్దాం అని కేటీఆర్ విసిరిన సవాల్‌కు స్పందించకుండా రేవంత్ తోక ముడిచాడు. మీడియా మేనేజ్మెంట్, పీఆర్ స్టంట్లతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించాలని భావిస్తున్నది అని దుయ్యబట్టారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే జనం కాంగ్రెస్‌ను బండకేసి కొడతారు.. పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కూడా కాంగ్రెస్ నాయకులకు తీరికలేదు. కేసీఆర్ మంజూరు చేసిన విద్యాసంస్థలను కొడంగల్‌కు తెచ్చుకోవడం తప్ప రేవంత్ ధరఖాస్తు పెట్టింది లేదు.. దమ్మిడి తెచ్చింది లేదు అని అన్నారు.

పాలమూరు రంగారెడ్డి పరిధిలో ఉన్న ఉద్దండాపూర్ నుండి కాలువ ద్వారా నీళ్లు తీసుకెళ్లకుండా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పేరుతో రేవంత్ తన రాజకీయ పునాదులు సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీకి ఇచ్చిన వినతిపత్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా అంశం పేర్కొనని రేవంత్ పాలమూరు ఎత్తిపోతల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ పెండింగ్ ప్రాజెక్టులను మేము రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం.. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మళ్లీ పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చి పాలమూరు వలసలకు మళ్లీ ఊపిరిపోసేలా ఉంది. ఉచిత బస్సు ప్రయాణం మినహా ఇప్పటి వరకు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు అని అన్నారు.

అధికారం వచ్చిన వెంటనే డిసెంబరు 9 నాడు రుణమాఫీ చేస్తం, రైతుభరోసా ఇస్తాం,  ఫించన్ డబల్, కళ్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం అని అరచేతిలో స్వర్గం చూయించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాయిదాల పద్దతి మొదలుపెట్టారు. కారుకూతలు తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు అని తెలిపారు.