mt_logo

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గళం.. నాగర్‌కర్నూల్‌కు బలం: కేటీఆర్

సంచలనాలకు, సంస్కరణలకు, సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొనియాడారు. నల్లమల ప్రాంతంలో పుట్టిన ప్రవీణ్ కుమార్ గారు తన 6 ఏళ్ల పదవి కాలాన్ని వదులుకొని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం బహుజనవాదాన్ని భుజాన ఎత్తుకొని ప్రజాసేవలోకి అడుగుపెట్టారు అని పేర్కొన్నారు.

తన పదవీ కాలంలో పోలీస్ వ్యవస్థలో ఎన్నో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రవీణ్ కుమార్, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కి ఆద్యులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఐక్యరాజ్యసమితి కోసం ఒకప్పటి యుగోస్లావియాలో కూడా పని చేశారు అని తెలిపారు.

తన సేవలకు గాను రాష్ట్రపతి పురస్కారం, యునైటెడ్ నేషన్స్ పోలీస్ మెడల్, పోలీస్ గ్యాలంట్రి మెడల్ వంటి ఎన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు అని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన గురుకుల విద్యా విప్లవంలో ప్రవీణ్ కుమార్ నిర్వహించిన పాత్ర అమోఘమైనది. సాంఘిక సంక్షేమ గురుకులాల ద్వారా ఎందరో బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు అందుకోవడానికి.. ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో సీట్లు సంపాదించడానికి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో క్రీడలో రాణించడానికి తన తోడ్పాటును అందించారు అని ప్రశంసించారు.

ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నారు. సమర్ధత గల నాయకులు పార్లమెంట్‌లో ఉంటే ఆ పదవికి వన్నె తేవడం ఖాయం.. మన సమస్యల పరిష్కారం తథ్యం అని తేల్చి చెప్పారు.

డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గళం.. నాగర్‌కర్నూల్‌కు బలం అని పేర్కొన్నారు. కారు గుర్తుకే ఓటేసి.. ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించాలని అని పిలుపునిచ్చారు