mt_logo

చరిత్ర పుటల్లో సిద్దిపేట!

సిద్దిపేట నియోజకవర్గం వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసుకుని రికార్డు సృష్టించిన సందర్భంగా చరిత్ర పుటల్లో నిలిచిన సిద్దిపేట పేరిట శుక్రవారం విజయోత్సవ సభ నిర్వహించారు. మంత్రి హరీష్ రావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేటకు ఈ ఘనత సాధించిపెట్టడంలో అధికారులు, ప్రజల సమిష్టి కృషి ఉందని, కేవలం 15 రోజుల వ్యవధిలోనే 5,531 మరుగుదొడ్లను నిర్మించడం గొప్ప విషయమని అన్నారు. రాష్ట్రంలోని 64 మున్సిపాలిటీల్లో సిద్దిపేట నూటికి నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణం, వందశాతం పన్నులు వసూలు సాధించిన ఘనత దక్కించుకుందని, ఇంకుడుగుంతల నిర్మాణంలో రాష్ట్రానికే ఇబ్రహీంపూర్ ఆదర్శంగా నిలిచిందని హరీష్ రావు తెలిపారు.

సీఎం కేసీఆర్ జూలై నెలలో 5,500 మొక్కలు నాటితే ఆ మొక్కలన్నీ పచ్చగా ఏపుగా పెరిగి సిద్దిపేట పట్టణానికే శోభను తెచ్చాయని హరీష్ రావు తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు నాటి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచామని, అభివృద్ధి అంటే సీసీ రోడ్లు, డ్రైనేజీ, పైప్ లైన్ వేయడం కాదని, ప్రజలు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి అవుతుందని అన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల స్ఫూర్తితో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు మరుగుదొడ్ల నిర్మాణంలో ముందడుగు వేయాలని, ఈ విజయోత్సవ స్ఫూర్తితో మరిన్ని స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అనంతరం శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలు పుణికిపుచ్చుకున్న మరో శక్తి హరీష్ రావు అని, సమాజాన్ని ఆలోచింపజేసే కార్యక్రమాల రూపకల్పనలో హరీష్ దిట్ట అని, చక్కటి నాయకుడు దొరకడం ప్రజల అదృష్టమని అన్నారు.

మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ మరుగుదొడ్డి అనేది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, స్వచ్చభారత్ లో భాగంగా సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు రావాలని ప్రధాని మోడీని కోరుతామని చెప్పారు. హోమంత్రి నాయిని మాట్లాడుతూ వందశాతం మరుగుదొడ్లతో సిద్దిపేట దేశానికే ఆదర్శప్రాయమైందని, తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న సిద్దిపేట గడ్డను రాష్ట్ర ప్రజలు మర్చిపోరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదగిరి రెడ్డి, పాతూరి సుధాకర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *