వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం సింగరాజుపల్లెలో వాటర్ గ్రిడ్ పైలాన్ ను ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభలో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వాటర్ గ్రిడ్ పథకం ఆషామాషీ పథకం కాదని, భగీరథ ప్రయత్నమని, అందరం గట్టిగా పట్టుబడితేనే పథకం విజయవంతం అవుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ మూడేళ్ళలో తాగునీరు అందిస్తామని, ఆడబిడ్డలెవరూ రోడ్డు మీదికి బిందె పట్టుకుని రాకుండా మంచినీళ్ళు అందేలా చూస్తామని మంత్రి చెప్పారు.
సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెడ్ల మాదిరిగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని, మనసున్న ప్రభుత్వం కాబట్టే మనిషికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని అన్నారు. హాస్టళ్ళలో సన్నబియ్యం ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దే.. అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నాం. కళ్యాణలక్ష్మి పథకం కింద దళిత, గిరిజనుల ఆడబిడ్డలకు రూ. 51 వేలు ఇస్తున్నాం. 60 ఏళ్లలో చేయని కార్యక్రమాలు చేస్తున్నాం. అయినా ప్రతిపక్షాలు అనవసరంగా నోరు పారేసుకుంటున్నాయని కేటీఆర్ విమర్శించారు.