mt_logo

సీఎం తలచుకుంటే 60 ఏళ్ల మోసాన్ని ఎండగట్టేవారు- కేటీఆర్

టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలపై ధ్వజమెత్తారు. శాసనసభలో రైతుల సమస్యలపై జరిగిన చర్చలో ఎక్కువ సమయం విపక్షాలకు కేటాయించడం జరిగింది. విపక్షాలు 6 గంటల 23 నిమిషాలు మాట్లాడితే అధికార పక్షం 1 గంట 50 నిమిషాలు మాత్రమే మాట్లాడిందని అన్నారు. విపక్షాలు చేసిన ప్రసంగాలు ఓపిగ్గా విన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సమస్యలపై స్పష్టంగా సమాధానం చెప్పారు.. 15 నెలల సమయంలో చేసిన అభివృద్ధిని వివరించాం. అయినా ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి. రచ్చ రాజకీయాలు చేయడమే పనిగా విపక్షాలు పెట్టుకున్నాయని మండిపడ్డారు.

నిన్న సీఎం కేసీఆర్ తలచుకుంటే విపక్షాలను చీల్చి చెండాడే వారు. కానీ సానుకూల దృక్పథంతో వ్యవహరించారు. ఆయన తలచుకుంటే 60 సంవత్సరాల మోసాన్ని ఎండగట్టేవారని కేటీఆర్ పేర్కొన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయలేని పనులు 15 నెలల కాలంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. రైతులకు చెప్పినవిధంగానే 6 గంటల నాణ్యమైన కరెంట్ అందించాం.. ఒకప్పుడు విత్తనాలు, ఎరువుల కోసం వీధి పోరాటాలు జరిగేవి. పోలీస్ స్టేషన్ లో విత్తనాలు సరఫరా చేసేవారు. రైతులు నిలబడలేక చెప్పులు క్యూలో పెట్టి ఎదురుచూపులు చూసేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా చేశాం. రుణమాఫీ కూడా చేశాం. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి ఉదయం పూటే వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇస్తామని మంత్రి చెప్పారు.

ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని, 60 ఏళ్ల దరిద్రం 15 నెలల్లో పోదని, ఓపిక ఉండాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్రం విషయంలో కేంద్రం దారుణంగా వ్యవహరిస్తుందని, నరేంద్రమోడీ తెలంగాణకు కూడా ప్రధానే అని, రైతులకు సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి కూడా ఉందని మంత్రి అన్నారు. బీజేపీ నేతలకు సత్తా ఉంటే రాష్ట్రానికి న్యాయం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం నుండి అడ్వాన్సులు ఇప్పించడం కూడా బీజేపీ నేతలకు చేతకాదు. తెలంగాణలోనే ఆత్మహత్యలు ఉన్నట్లు బీజేపీ నేతలు చెప్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంటల బీమా పథకంలో ఎన్నో లోటుపాట్లు చోటుచేసుకున్నాయని కేటీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *