ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మంచి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని, కరోనాతో ఒకరిద్దరికి తప్ప మిగతా వారికి పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవని పంచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్ నుండి పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, పెద్దవంగర, తొర్రూరు, దేవరుప్పల, రాయపర్తి మండలాల్లోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులతో మంత్రి గురువారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కరోనా బారిన పడిన వారితో మాట్లాడారు. ఆరోగ్యం బాగుందా? వైద్యం అందుతోందా? మీరు అధైర్యపడొద్దు.. మీకేం కాదు. కరోనాతో భయపడాల్సింది ఏమీ లేదు అని ధైర్యం చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలి.. ప్రైవేట్ హాస్పిటల్స్ ను మించిన మంచి వసతులు ప్రభుత్వ దవాఖానల్లో ఉన్నాయి. మీకు నేనున్నాను. మీకేం కాదు.. మరీ ఇబ్బంది అనిపిస్తే నాకు కానీ, నా దగ్గర పనిచేసే సిబ్బందికి గానీ ఫోన్ చేయండని భరోసా ఇచ్చారు. ప్రజాప్రతినిధులు ఓట్లప్పుడే కాకుండా కష్ట కాలంలోనూ ప్రజలను పట్టించుకోవాలని అన్నారు. తినడానికి ఇబ్బంది ఉన్నవాళ్లకు చందాలు వేసుకుని ఆసరాగా నిలవాలని వారికి పిలుపునిచ్చారు.