mt_logo

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు- పువ్వాడ అజయ్

ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో మూడు కరోనా టెస్టింగ్ వాహనాలు, ఒక కోవిడ్ రెస్పాన్స్ వెహికల్ (అంబులెన్స్) ను రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ అంబులెన్స్ ద్వారా ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని, రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఖమ్మం నగరంలోని ప్రభుత్వ వైద్య శాలలో మెరుగైన సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు.

ఇటీవల మంత్రి కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా కరోనా పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రులకు తన సొంత డబ్బుతో ఆరు అంబులెన్సులను అందించిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని అజయ్ కుమార్ అంబులెన్స్ కొనుగోలు కోసం రూ. 20.50 లక్షల చెక్కును కేటీఆర్ కు అందించారు. రాష్ట్రంలోని 32 జిల్లాలకు కలిపి మొత్తం 100 అంబులెన్సులను అందజేసేందుకు ప్రజాప్రతినిధులు సిద్దమయ్యారు. ఈ మేరకు సిద్దమైన అంబులెన్సులను మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ లతో కలిసి అజయ్ కుమార్ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో కోవిడ్ రెస్పాన్స్ వెహికల్ (అంబులెన్స్) ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం నుండి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

మరోవైపు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వీధి వ్యాపారుల కోసం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదురుగా రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు బజార్ ను అజయ్ కుమార్ గురువారం ప్రారంభించారు. దీంతోపాటు స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కేటీఆర్ గారి సూచనల మేరకు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్రజలు ఇబ్బంది పడకుండా పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో త్రీ టౌన్ లోని డాబాల బజార్, రోటరీ నగర్ లో నిర్మించిన మోడ్రన్ టాయిలెట్లను గురువారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *