mt_logo

కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి: కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వాస్తవాలపై రూపొందించిన కరపత్రాన్ని సిరిసిల్లలో ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కూల్చే కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లను తొలగించి మరమ్మత్తులు చేసి ప్రాజెక్ట్‌ను పునరుద్దరణ చేపట్టాల్సిన ప్రభుత్వం అసత్య ఆరోపణలతో బీఆరెస్‌ను బదనామ్ చేసే కుట్ర పన్నుతోందాన్నారు.

ప్రపంచంలోనే నంబర్ వన్ ప్రాజెక్ట్‌గా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఏర్పడిన చిన్న చిన్న సాంకేతిక లోపాలను భూతద్దంలో చూపిస్తూ ప్రాజెక్ట్ ప్రతిష్టను మంటగలుపుతోందని విమర్శించారు. ఓట్ల కోసం రైతుల నోట్లో మట్టిగొట్టే పనులు మానుకోవాలని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై నిజానిజాలను ప్రజలకు వివరించేందుకు మార్చి ఒకటిన ఛలో కాళేశ్వరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

మంథని బీఆరెస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వాస్తావాలను వివరిస్తూ రూపొందించిన ఈ కరపత్రాన్ని చదివితే పూర్తిగా అవగతమవుతుందని తెలిపారు. పార్టీ శ్రేణులు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ సాగిస్తున్న కుట్రలను ప్రజలకు కూలంకషంగా వివరించి తిప్పికొట్టాలని కోరారు.