ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతిక విషయాల్లో జరుగుతున్న అభివృద్ధిని తెలంగాణ రైతులకు అందచేయడమే తమ అమెరికా పర్యటన ప్రధాన లక్ష్యమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధిల్లాలి, తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం. భవిష్యత్ తరాలు వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించే పరిస్థితులు రావాలని మంత్రి పేర్కొన్నారు.
అమెరికా పర్యటనలో భాగంగా రెండో రోజు అయోవా రాష్ట్రంలోని లాంగ్ వ్యూ ఫార్మ్ అనే భారీ వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి సందర్శించారు. నూతన టెక్నాలజీ వినియోగంలో ఎంతో పురోగతి సాధించిన లాంగ్ వ్యూ ఫార్మ్ వ్యవసాయ క్షేత్రంలో.. జీపీఎస్ ద్వారా ఒక్క సెంటీమీటర్ తేడా లేకుండా విత్తడం, భారీ యంత్రాల సాయంతో దున్నడం నుండి పంట నూర్పిళ్ల వరకూ పనులు చేయడం, హెలికాప్టర్లు మరియు డ్రోన్ల ద్వారా క్రిమి సంహారక మందుల స్ప్రేయింగ్, మొక్క ఎదుగుదలను ప్రతి స్టేజిలో డేటా సేకరించి మానిటర్ చేయడం వంటి వాటిని మంత్రి బృందం పరిశీలించింది.
లాంగ్ వ్యూ ఫార్మ్ సందర్శించిన బృందానికి సీఈఓ స్టీవ్ హెన్రీ అన్ని వివరాలతో కూడిన ఒక ప్రెజెంటేషన్ చేశారు. భారీ వ్యవసాయ క్షేత్రాలను నిర్వహించడంలో ఉండే సాధక బాధకాలను, తమ అనుభవాలను స్టీవ్ హెన్రీ పంచుకున్నారు. తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రధానంగా మొక్కజొన్న (కార్న్), సోయాబీన్ పండిస్తామని తెలిపారు. కేవలం ఆహార ధాన్యాలే కాకుండా, మేలురకమైన విత్తనాలను కూడా ఉత్పత్తి చేస్తామని, ఆహార ధాన్యాలతో పోలిస్తే విత్తన ఉత్పత్తి వలన లాభాలు మూడు రెట్లు ఎక్కువగా వస్తున్నాయని, పశువులు, పందుల పెంపకం కూడా చేస్తున్నామని, భూసారాన్ని కాపాడుకోవడానికి, నెల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు.
అమెరికాలో వ్యవసాయ పరిస్థితులు భారతదేశ వ్యవసాయంతో పోలిస్తే కొంత భిన్నం. ఇక్కడ భారీ కమతాలు, మానవ వనరుల కొరత వలన పెద్ద ఎత్తున యాంత్రీకరణ అనివార్యమయింది. ఇక్కడి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా మనదేశానికి భిన్నంగా ఉన్నాయి అని మంత్రి అన్నారు. ఇక్కడి రైతులు కొంత కార్పొరేటీకరణ వల్ల ప్రభుత్వం మీద పెద్దగా అధారపడటం లేదని మా అధ్యయనంలో అర్ధమయింది అని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో చిన్న కమతాలు ఎక్కువ కాబట్టి భారీ యంత్రాల వినియోగం వ్యక్తిగత స్థాయిలో సాధ్యపడదు .. అందుకే రైతులు సహకార సమాఖ్యలుగా సంఘటితం అయ్యి యాంత్రీకరణ ఫలాలు అందుకోవాలి. సహకార వ్యవస్థ బలోపేతం అయితేనే భవిష్యత్ లో కార్పొరేట్లకు ధీటుగా నిలబడటం సాధ్యపడుతుంది. సహకార శక్తి సంఘటితం అయితే ఏ కార్పొరేట్ శక్తి కూడా దాని ముందు నిలవలేద అని మంత్రి తెలిపారు.
సహకార సంఘాలను విజయవంతంగా ఎలా నడపాలో మహారాష్ట్ర చక్కెర రైతుల అనుభవం నుండి, తెలంగాణ ముల్కనూరు సహకార సంఘాల నుండి నేర్చుకోవాలన్నారు. యాంత్రీకరణలో భాగంగా ప్రతి గ్రామంలో యంత్ర పరికరాలను చౌకగా అద్దెకు ఇచ్చేలా ఊబరైజేశన్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి చర్చ జరగాలని రానున్న రోజుల్లో తెలంగాణ రైతాంగం కూడా యంత్ర శక్తిని విరివిగా వినియోగించుకోవడానికి అవసరమయ్యే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం అని తెలిపారు.
దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వ్యవసాయ విధానాలు .. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆదాయం, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు బంధు లాంటి పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో వ్యవసాయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మన తెలంగాణ రైతుల ప్రగతి మరో మెట్టుకు చేరాలంటే, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు.
గత తొమ్మిదిన్నరేళ్ళలో తెలంగాణ వ్యవసాయ రంగం గణనీయమైన పురోగతి సాధించింది. ఇప్పుడు ఆధునిక పద్దతిలో వ్యవసాయం చేయడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది.. రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తే సాగు ఖర్చు తగ్గుతుంది .. ఉత్పత్తి అధికంగా రావడంతో పాటు, ఉత్పత్తి, నాణ్యత కూడా పెరుగుతుంది. కేవలం వ్యవసాయంపై ఆధారపడటమే కాకుండా, వ్యవసాయంతో ముడిపడి ఉన్న పశువుల పెంపకం, కోళ్ల పరిశ్రమ లాంటి వ్యవసాయ అనుబంధరంగాలపై కూడా వ్యవసాయదారులు దృష్టి పెట్టాలని మంత్రి అన్నారు.
అనంతరం ఇల్లినాయిస్ రాష్ట్రంలోని డికెటర్ నగరంలో ఫార్మ్ ప్రోగ్రెస్ షో కు హాజరై ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఫార్మ్ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ’ఫార్మ్ ప్రోగ్రెస్ షో’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులను, ప్రముఖ వ్యవసాయ కంపెనీలను, సంస్థలను అనుసంధానిస్తున్నది.
వందలాది ఎగ్జిబిటర్‌లతో, తాజా వ్యవసాయ ఉత్పత్తుల గురించి, సాంకేతికత గురించి, సరికొత్త ఆవిష్కరణల గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి, ప్రపంచ స్థాయి వ్యవసాయ నిపుణులను, సంస్థల ప్రతినిధులను ప్రత్యక్షంగా కలవడానికి ఈ ‘ఫార్మ్ ప్రోగ్రెస్ షో’ ఉపయోగపడుతున్నది.
ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, పశుసంపద, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సేంద్రీయ వ్యవసాయం, హార్టికల్చర్, వ్యవసాయ విద్య వంటి వ్యవసాయానికి సంబంధించిన వివిధ రంగాలకు చెందిన స్టాల్స్‌ను బృందం పరిశీలించింది.
విత్తనాలు, యంత్రాలు తయారుచేసే ప్రపంచ ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో మాట్లాడి ఆధునిక సాంకేతికత గురించి మంత్రి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇస్టా అధ్యక్షులు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ పాల్గొన్నారు.