mt_logo

ప్రాజెక్టులు కడదాం.. పంచాయితీ తర్వాత..

By: కట్టా శేఖర్‌రెడ్డి

చంద్రబాబు, ఆయన రాజకీయ లక్ష్యాలు స్పష్టం. ఆయన ఆంధ్ర మేలుకోరకపోతే తెలంగాణ మేలు ఎలా కోరతారు? మన మేలు మనమే చూసుకోవాలి. ఇక్కడి రాజకీయ పక్షాలన్నింటికీ ఆ విషయంలో స్పష్టత రావాలి. ప్రాజెక్టుల విషయంలో కలిసి ముందుకు సాగాలి. ఎడ్డెమంటే తెడ్డెమనడానికి చంద్రబాబు, ఆయన మనుషులు, ఆయన పత్రికలు, మీడియా ఉన్నాయి. అవి సృష్టించే మాయా చక్రబంధంలో చిక్కుకుని ఆగమైపోవలసిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ రాజకీయ పక్షాలను విశ్వాసంలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. ఒక యజ్ఞంలాగా చేస్తే తప్ప ఆరు దశాబ్దాల వెనుకబాటును పూడ్చుకోలేము.

సాగునీరు, తాగునీరు విలువ ఇప్పటికీ మనం గుర్తించలేదు. ప్రాజెక్టులు ముందుగా పూర్తి చేసుకోవాలి, పంచాయితీ తర్వాత పెట్టుకుందాం అన్న స్పృహ మన రాజకీయ నాయకత్వానికి ఇంకా అబ్బినట్టుగా లేదు. తెలంగాణ వెనుకబడడానికి, ఇన్నేండ్ల తన్లాటకు సాగునీరు, తాగునీరు లేకపోవడమే. ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడానికి మూల ఇంధనం నీరే. నీరు సంపదలను సృష్టిస్తుంది. నీరు అదనపు విలువను సృష్టిస్తుంది. నీరు పెట్టుబడులను పోగుచేస్తుంది. నీరు ప్రజలను సంపన్నులను చేస్తుంది. నీరు నాగరికతను పెంచుతుంది. నీరు అత్యంత ఖరీదైన ఖనిజం. జాతి జీవనాధారం. అది ఎప్పుడుపడితే అప్పుడు దొరకదు. దొరికినప్పుడు ఒడిసిపట్టుకోవాలి. అందుకు ఒక రాజకీయ సంకల్పం కావాలి.

పట్టుదల కావాలి. ఏకీభావం రావాలి. ఎక్కడయినా తిట్టుకుందాం, ప్రాజెక్టులు కట్టుకుందాం అని అనుకోకపోతే ఏళ్ల తరబడి ఈ పంచాయితీ నడుస్తూనే ఉంటుంది. చంద్రబాబునాయుడు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి. మనకు సమస్యలు సృష్టించడం ఆయనకు అవసరం. మన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఆయనకు రాజకీయంగా లాభసాటి. అందువల్ల ఆయన మాట్లాడుతూ ఉంటాడు. లేఖలు రాస్తూ ఉంటాడు. చంద్రబాబు కానీ, మరో ముఖ్యమంత్రి కానీ అదే పని చేస్తారు. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రులు కర్ణాటక, మహారాష్ట్రలకు వ్యతిరేకంగా ఇలాగే లేఖలు రాశారు. ఆ రాష్ట్రాలు నిర్మించే ప్రాజెక్టులపై రకరకాల అభ్యంతరాలు లేవనెత్తుతూ వచ్చారు. కానీ ఏ ప్రాజెక్టు ఆగింది? బాబ్లీని ఆపగలిగామా? ఆల్మట్టిని ఆపగలిగామా? లేఖలు చెత్తబుట్టలో వేసి వారు ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టిని కేంద్రీకరించారు.

తెలుగుదేశం నాయకులు బాబ్లీని అడ్డంపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం కొడదామని వేషాలేస్తే, మహారాష్ట్ర రాజకీయ పక్షాలన్నీ ఏకమై వీరిని నిలువరించే ప్రయత్నం చేశాయి. అక్కడ బంద్ పాటించాయి. ఆల్మట్టి ఛాయల్లోకి కూడా వెళ్లలేకపోయాం. అంతదూరం ఎందుకు మన రాష్ట్రంలోనే పోతిరెడ్డిపాడును అక్రమంగా విస్తరించే ప్రాజెక్టును ప్రారంభిస్తే అక్కడికి వెళ్లడానికి ఎవరయినా సాహసించారా? రాయలసీమ వాసులు ఇక్కడికి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఈ పార్టీ ఆ పార్టీ లేదు. అందరూ కట్టగట్టుకుని విరుచుకుపడ్డారు. ఆర్డీఎస్ వద్ద రాయలసీమ వైపు మనకు జరిగే అన్యాయాలకు ఏ పార్టీ పేరుపెడదాం? అది వారి ఐక్యత. అవసరం. వారు కరెక్టుగానే ఉన్నారు. మరి మనం ఉన్నామా?

గోదావరి నదిపై నాసిక్ ఎగువన జలాల్‌పూర్ వద్ద మొదలుపెట్టి బాబ్లీ వరకు 63 చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు, బరాజులు నిర్మించింది మహారాష్ట్ర. ఎప్పుడూ ఏ వివాదాలు మనదాకా రాలేదు. వారొక గొప్ప పని ఏం చేశారంటే అత్యధికంగా బరాజు కం బ్రిడ్జిలు నిర్మించారు. ప్రతి పది ఇరవై కిలోమీటర్లకు ఒక బరాజు నిర్మించారు. దీంతో నది పొడవునా ఎక్కడ చూసినా నది ఎండిపోయి కనిపించదు. అంతటా నీరు నిలబడి కనిపిస్తుంది. అది కూడా నదీ ప్రవాహగర్భంలోనే. భూసేకరణ, భూముల ముంపు ఎక్కడా పెద్దగా లేదు. ఇలా ఆపుకున్న నీటిని గ్రావిటీ ద్వారా మళ్లించుకునే అవకాశం వచ్చిన చోట కాలువలు తవ్వుకున్నారు. ఎత్తిపోవలసిన చోట ఎత్తిపోసుకున్నారు. పైగా నది పొడవునా సహజంగానే భూగర్భ జలాలు విపరీతంగా పెరుగుతాయి. మహారాష్ట్ర ప్రస్తుతం ఎంత నీటిని ఆపుకుంటున్నదో ఎవరివద్దా లెక్కలు లేవు.

ఏ రాష్ట్రమయినా తమ ప్రజలకోసం ఇలాగే చేస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ల ప్రజల గురించి కాకపోతే మన ప్రజల గురించి ఆలోచిస్తుందా అని ప్రశ్నించారు అనుభవజ్ఞుడయిన ఒక నీటిపారుదల నిపుణుడు. మనకయితే గోదావరి ఒట్టిపోయి కనిపిస్తున్నది. శ్రీరాంసాగర్ దిగువన కాళేశ్వరం దాకా వర్షాలు వచ్చినప్పుడు తప్ప నది ఎప్పుడూ ఎండిపోయి కనిపిస్తూ ఉంటుంది. వర్షాలు వచ్చినా పడిన చినుకు పడినట్టే ధవళేశ్వరం చేరేవి. ఎల్లంపల్లి నిర్మించేదాకా పరిస్థితి ఇదే. మరోవైపు కృష్ణా, భీమా నదులపై కూడా ఇదే పరిస్థితి. ఈ రెండు నదులపై కూడా కర్ణాటక, మహారాష్ట్ర ఇదే పనిచేశాయి. భీమా నది మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా కృష్ణా ఒడిని చేరుతుంది. గూగుల్ ఎర్త్ తాజా మ్యాపులు చూస్తే భీమా నది కూడా ఇంత సజీవంగా ఉంటుందా అనిపించింది. ఎక్కడ చూసినా నీరు నిలబడి ఉంటుంది.

ఈ ప్రాజెక్టుపై కూడా రెండు రాష్ట్రాల్లో కలిపి బరాజులు, ప్రాజెక్టులు నలభైకి పైగా వచ్చాయి. కర్ణాటక, మహారాష్ట్రలు నదులను వాటర్‌షెడ్‌లుగా మార్చాయి. కృష్ణా నది, దాని ఉపనదులపై కర్ణాటక నిర్మించిన ప్రాజెక్టుల నీటి నిల్వల ఆడిటింగ్ చేస్తే వాళ్లేం చేశారో, మనం ఏం చేస్తున్నామో అర్ధమవుతుంది. ఆగస్టులో అడుగుపెట్టినా మనకు చుక్కనీరు ఎందుకు రావడంలేదో అర్థం అవుతుంది. రాజకీయ కయ్యాలు, మేధో వైపరీత్యాలు సృష్టించే వాళ్లంతా ఒకసారి శాంతంగా త్రయంబకం నుంచి కందకుర్తి దాకా, మహాబలేశ్వరం నుంచి కృష్ణ దాకా నదుల వెంట పర్యటించి చూసొస్తే తెలంగాణకు ఏమైనా మేలు జరుగుతుందని అనిపిస్తుంది. మనం చేయవలసిందేమిటో కూడా అర్థమవుతుంది.

గోదావరి నది మన రాష్ట్రంలో 500కి పైగా కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఇందులో 60-70 కిలోమీటర్లు మాత్రమే మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌లతో ఉమ్మడి సరిహద్దు ఉంది. మిగిలిన నదీ ప్రవాహం అంతా మన భూభాగంలోంచే పాపికొండలను చేరుతుంది. నదిపొడవునా మనం చిన్న ప్రాజెక్టులు, బరాజు కం బ్రిడ్జిలు నిర్మించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు కూడా ఇటువంటిదే. భూసేకరణ, ముంపు పెద్దగా లేకుండానే 11.5 టీఎంసీల నీటిని నిలుపుకోవడానికి అవకాశం ఉన్న ప్రాంతం మేడిగడ్డ. కాళేశ్వరం నుంచి మేడిగడ్డ దాకా నది వెడల్పు రెండు నుంచి నాలుగైదు కిలోమీటర్లు ఉంది. ఇదొక్కటే కాదు. ప్రాణహితపై కూడా ఇలా చేయడానికి అవకాశం ఉంది. తుమ్మిడిహట్టి వద్ద తక్కువస్థాయి బరాజు నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు అవసరమైన నీటిని మళ్లించుకోవచ్చు. తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం దాకా చిన్నచిన్న బరాజులు నిర్మించవచ్చు.

గోదావరి, ప్రాణహితపై ప్రతి పది కిలోమీటర్లకు ఒకటి చొప్పున నది పొడవునా బరాజులు నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. తెలంగాణలో గోదావరి నది ఎక్కడ చూసినా చాలా వెడల్పుతో ప్రవహిస్తున్నది. మరో ముఖ్యమైన అంశం ఏమంటే కడెం నది కలిసిన తర్వాత నుంచి గోదావరి నదిలో ఎప్పుడూ నీరు లభిస్తుంది. కాళేశ్వరానికి దిగువన అయితే నిరంతరం నీరు లభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆదిలాబాద్, గడ్చిరోలి, చత్తీస్‌గడ్‌లోని ఇంద్రావతీ అడవుల నుంచి నదులు, వాగులు మొదటి వానలకే పొంగి ప్రవహించడం చూస్తున్నాం. ఇలా చేయగలిగితే నది పొడవునా నీరు నిలువ ఉంటుంది. సమీప ప్రాంతాలలో భూగర్భ జలాలు పెరుగుతాయి. శ్రీరాంసాగర్ దిగువన గోదావరి నదీగర్భం సముద్ర మట్టం నుంచి 1010 అడుగులు.

మేడిగడ్డ ఇవతలి ఒడ్డు ఎత్తు సముద్ర మట్టానికి 390 అడుగులు. కరీంనగర్, మెదక్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో చాలా ప్రాంతాలు సముద్ర మట్టం నుంచి 500 నుంచి 1500 అడుగుల ఎత్తున ఉన్నాయి. నది పొడవునా నీటిని ఒడిసి పట్టగలిగితే తెలంగాణ అంతటా భూగర్భ జల మట్టాలు పెరిగే అవకాశం ఉంది. బరాజుల నుంచి వీలైన చోట గ్రావిటీ ద్వారా, లేకుంటే ఎత్తిపోతల ద్వారా నీటిని సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అన్ని చోట్ల విద్యుత్ ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేసుకునే వీలు ఉంటుంది.

కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రాంతాలను చూసి నేర్చుకోవలసింది ఒక్కటే. ప్రాజెక్టుల విషయంలో, నదీ జలాలను వినియోగంలోకి తెచ్చుకునే విషయంలో మనమంతా ఒక్కటే అనే సందేశం ఇవ్వగలగాలి. చంద్రబాబు ఏం చేస్తున్నాడు? ఎలా చేస్తున్నాడు? అనవసరం. అత్యంత వేగంగా గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్లించుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. కొత్తగా నిర్మించుకోబోయే రాజధాని అవసరాలు, కృష్ణా 3 డెల్టా అవసరాలు దృష్టిలో ఉంచుకుని పట్టిసీమ నుంచి గోదావరి నీటిని మళ్లించుకుంటున్నాడు. ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఆయన అనుకున్నది చేస్తున్నాడు. ఆయనకు ఆ ప్రాజెక్టు అవసరం కూడా. చంద్రబాబు మనతో సంప్రదించకపోవచ్చు. మనకు ఏమీ హామీలు ఇవ్వకపోవచ్చు. కానీ కృష్ణాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి నీటిలో ఎగువ ప్రాంతాలకు, ఎగువ రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ 1976 లోనే పంపకాలు వేసింది. కర్ణాటక, మహారాష్ట్రలకు 35 టీఎంసీలు, కృష్ణా ఎగువ ప్రాంతాలకు 45 టీఎంసీలు ఇవ్వాలని బచావత్ స్పష్టంగా పేర్కొంది.

బచావత్ తీర్పు రాసిన నాటికి తెలంగాణ ఎగువ ప్రాంతం. ఇప్పుడు ఎగువ రాష్ట్రం. చంద్రబాబు ఆ 45 టీఎంసీల విషయమై మాట్లాడితే బాగుండేది. తెలంగాణ హక్కును గుర్తిస్తే సంతోషం. చంద్రబాబు గుర్తించనంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. మనం మన 45 టీఎంసీలు తీసుకోవలసిందే. కృష్ణా నదిలో మన వాటా జలాలను మనం తీసుకోవలసిందే. చంద్రబాబు, ఆయన రాజకీయ లక్ష్యాలు స్పష్టం. ఆయన ఆంధ్ర మేలుకోరకపోతే తెలంగాణ మేలు ఎలా కోరతారు? మన మేలు మనమే చూసుకోవాలి. ఇక్కడి రాజకీయ పక్షాలన్నింటికీ ఆ విషయంలో స్పష్టత రావాలి. ప్రాజెక్టుల విషయంలో కలిసి ముందుకు సాగాలి. ఎడ్డెమంటే తెడ్డెమనడానికి చంద్రబాబు, ఆయన మనుషులు, ఆయన పత్రికలు, మీడియా ఉన్నాయి.

అవి సృష్టించే మాయాచక్రబంధంలో చిక్కుకుని ఆగమైపోవలసిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ రాజకీయ పక్షాలను విశ్వాసంలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. ఒక యజ్ఞంలాగా చేస్తే తప్ప ఆరు దశాబ్దాల వెనుకబాటును పూడ్చుకోలేము. నదుల్లో నీళ్లున్నాయి. ఈసారి కరువు వచ్చింది కావచ్చు. కానీ ఇంత కరువు సంవత్సరంలో కూడా ధవళేశ్వరం నుంచి ఆగస్టు ఆరునాటికి 489 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది. ఇది ఆంధ్ర, తెలంగాణ నీటిపారుదల అధికారులు అధికారికంగా నమోదు చేసిన వివరాలే సుమా. ఒక్క టీఎంసీ నీటితో పండించే పంటల ఆదాయం సుమారు 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఉంటుందని వ్యవసాయార్థిక నిపుణులు అంచనా వేస్తారు. ఇంతకంటే వివరాలు అవసరమా… మనకు కావలసింది సంకల్పం, చిత్తశుద్ధి. ఎక్కడయినా కొట్లాడదాం. ప్రాజెక్టుల విషయంలో కలిసి సాగుదాం..

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *