mt_logo

ఆడబిడ్డలను అవమానించడమే సీఎంకు నిత్యకృత్యంగా మారింది: సబితా ఇంద్రారెడ్డి

మేము నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిలబడితే సీఎం, అధికార పక్షం వాళ్ళు రాక్షసానందం పొందుతున్నారు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన అని ఊదరగొడుతున్నారు. మహిళలకు ఇచ్చిన హామీలే కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చాయి అని అన్నారు.

మహిళలు రాష్ట్రంలో భయంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఇదే విషయాన్ని అసెంబ్లీలో నేను ప్రస్తావించా. అసెంబ్లీలో మహిళలకు మైక్ ఇవ్వడానికి ఈ సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారు అని దుయ్యబట్టారు.

మేము నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిలబడితే సీఎం, అధికార పక్షం వాళ్ళు రాక్షసానందం పొందుతున్నారు.. ఆడబిడ్డలు నిలబడితే వాళ్ళు ఆనందిస్తున్నారు. వైఎస్, చంద్రబాబు, కేసీఆర్‌లను సీఎంలుగా చూశాం.. వాళ్ళు మహిళలు ఇన్ని గంటలు నిలబడితే స్పందించేవారు అని గుర్తు చేశారు.

ఎస్సీ వర్గీకరణపై కోవా లక్ష్మీ మాట్లాడాలి అనుకుంటే ఆమెకు కూడా మైక్ ఇవ్వలేదు.. మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే కనీస స్పందన లేదు.. గతంలో ఇలా ఎప్పుడు లేదు. స్పీకర్ కూడా మా వినతిని పట్టించుకోలేదు. అంబేద్కర్ దళితుల గురించే కాదు మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం గురించి కూడా చెప్పారు.. దాన్ని కనీసం పాటించలేదు అని విమర్శించారు.

భట్టి సీఎం పదవి కోసం కొట్లాడాల్సింది పొయి సీఎల్పీ పదవి మా వల్ల పోయింది అంటున్నారు. అసెంబ్లీలో ఇపుడున్న వాళ్లలో ఎంతమంది పార్టీలు మారలేదు.. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారారు. ఈరోజు కూడా సీఎం రేవంత్ మమ్మల్ని మళ్ళీ నిందించారు. సభలో లేని ఎమ్మెల్సీ కవిత పేరును సీఎం తీసుకోవడం ఎంత వరకు కరెక్టు అని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.

ఆడబిడ్డలను అవమానించడమే ఈ సీఎంకు నిత్యకృత్యంగా మారింది.. సీఎం పదవి కున్న గౌరవాన్ని రేవంత్ కాపాడుకుంటే మంచిది. రాహుల్ గాంధీ రేవంత్‌ను నమ్ముకున్నారు.. ఆయన బతుకు సికింద్రాబాద్ స్టేషన్ చేస్తారా అని ఎద్దేవా చేశారు.

సభలో పురుష ఎమ్మెల్యేలు నిలబడితే అధికార పక్షం తీరు ఇలానే ఉంటుందా. మహిళలపై అత్యాచారాల గురించి రేపు సభలో లేవనెత్తుతాం. మాకు రేపు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలి. మా గురించి మేము మాట్లాడుకోం.. మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాలపై ప్రభుత్వం సమాధానం గురించి పట్టుబడుతాం అని స్పష్టం చేశారు.

ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి.. మాకు అండగా నిలిచిన మహిళ లోకానికి బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా ఎమ్మెల్యేలను పోలీస్ వాహనాల్లో తెలంగాణ భవన్‌కు తరలించడాన్ని ఖండిస్తున్నాం అని అన్నారు.

నేను రేవంత్‌ను నడిబజార్‌లో నిలబెట్టలేదు, రాజ్ భవన్‌లో కూర్చోబెట్టాను.. ఆనవసర విషయాలు మాట్లాడితే రేవంత్ రెడ్డికు మంచిది కాదు.. చేవెళ్ల చెల్లెమ్మా అని నన్ను వైఎస్ పిలిచారు. పీసీసీ అధ్యక్షులు కూడా పార్టీ మారారు.. మమ్మల్నే భట్టి టార్గెట్ చేయడం ఎందుకు. సీఎం అక్కలు అక్కలు అంటూనే పంగనామాలు పెడుతున్నారు అని ధ్వజమెత్తారు.

మాకు సీఎం క్షమాపణ ముఖ్యం కాదు.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వ స్పందనే ముఖ్యం అని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.