తెలంగాణలోని ఏ అన్నదాత కూడా పెట్టుబడికి మంది దగ్గర చేయి చాచకుండా తెలంగాణ సర్కారు ప్రతి పంటకూ పెట్టుబడి సాయం అంజదేస్తున్నది. సీజన్‌కు ముందే ప్రతి ఏటా ఎకరానికి రూ. 10వేలను బ్యాంకు ఖాతాలో జమచేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం అందజేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నెల 16 నాటికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ పూర్తయి, పాస్‌బుక్ పొందినవారు ఈ సీజన్‌లో రైతుబంధుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాల్లో అర్హులైన రైతుల నుంచి ఏఈవోలు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. కొత్త రైతులే కాకుండా భూమి ఉన్నప్పటికీ గతంలో ఎన్నడూ రైతుబంధు సాయం పొందని రైతులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఈ వానకాలం సీజన్‌కు సంబంధించి ఈ నెల 26 నుంచి రైతుబందు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేయడంతో తదనుగుణంగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే రైతుబంధు అర్హులకు సంబంధించిన వివరాలను సీసీఎల్‌ఏ నుంచి స్వీకరించినట్టు తెలిసింది. ఇక ఈసారి కొత్త రైతులు సుమారు లక్ష మంది వరకు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. గత సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 65 లక్షల మందికి రైతుబంధు పంపిణీ చేసింది. ఈ సీజన్‌లో కొత్త రైతులతోపాటు పోడు రైతులకు కూడా రైతుబంధు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ నెల 24 నుంచి పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. 1.50 లక్షల మంది పోడు రైతులకు 4 లక్షల ఎకరాల పట్టాలకు సంబంధించిన పట్టాలను అందజేయనున్నారు. దీంతో ఈసారి రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య 67.50 లక్షలకు చేరుతుందని అధికారులు భావిస్తున్నారు.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
భూమి పాస్‌బుక్ జిరాక్స్ లేదా ఎమ్మార్వోతో డిజిటల్ సంతకం అయిన డీఎస్ పేపర్
రైతు ఆధార్‌కార్డు జిరాక్స్
బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్