mt_logo

హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అందింది గుండు సున్న: మంత్రి కేటీఆర్‌

ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ తెలంగాణకు రావాల్సిన పెండింగ్‌ అంశాలపై, పార్టీ ఎంపీలతో కలిసి వివిధ ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి అంశాలు అందించాల్సిన సహాయంపై పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు. ఇందులో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ను కలిసారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఐటీ, ఏరో స్పేస్, డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఇలా అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతున్న హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేంద్ర సహకరించాలని అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. 9 సంవత్సరాలలో హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అందింది గుండు సున్న. హైదరాబాద్ లాంటి నగరంలో స్కైవేల నిర్మాణం కోసం అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. రక్షణ శాఖ మంత్రులు మారుతున్నా, కానీ కేంద్ర ప్రభుత్వ వైఖరి మారలేదు. 

స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధాన మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేదు. జూబ్లీ బస్టాండ్ నుంచి రాజీవ్ రహదారి వరకు ఒక స్కై వే నిర్మాణం… పారడైజ్ చౌరస్తా నుంచి మేడ్చేల్ ఓఆర్ఆర్ వరకు మరో స్కై వే నిర్మాణం… వీటికి రక్షణ శాఖ భూములు ఇవ్వాలని అనేకసార్లు విజ్ఞప్తి చేశాం. మరోసారి ఈ విషయాన్ని రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లాం.  రక్షణ శాఖ నుంచి రాజీవ్ రహదారి వైపు స్కైవేల నిర్మాణం కోసం 96 ఎకరాల భూమి ,మేడ్చల్ వైపు మరో 56 ఎకరాల  భూమి ఇస్తే అంతే విలువ కలిగిన భూమిని ఇస్తామని చెప్పినా స్పందన లేదు. 

స్కై వేల మాదిరే స్కై వాక్ ల నిర్మాణాన్ని కూడా చేస్తున్నాం. ఉప్పల్ లో చేపట్టింది స్కై వాక్ పూర్తయింది. కానీ రక్షణ శాఖ పరిమితుల వల్ల మెహదీపట్నం లో ప్రారంభించిన ప్రాజెక్టు ఆగిపోయింది. కంటోన్మెంట్లో నిరుపయోగంగా ఉన్న భూములను జీహెచ్ఎంసీకి  ఇస్తే అక్కడ ప్రజలకు అవసరమైన ఆస్పత్రులు కమ్యూనిటీ హాల్ లను నిర్మాణం చేస్తామని కోరాం. మా వైపు నుంచి ప్రయత్న లోపం  లేకుండా గత పది సంవత్సరాలుగా ఈ అంశాలను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈసారి అయినా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. రేపు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలుస్తున్నాము. లక్డికాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రో రైల్ విస్తరణ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో కోసం విజ్ఞప్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే అనేకసార్లు ఈ అంశంలో డిపిఆర్లు ఇచ్చాము. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఎంఎంటీఎస్ కోసం అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినా కేంద్రం నుంచి లేదని అన్నారు.