mt_logo

ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన రుయా గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్..

తెలంగాణలో అత్యాధునిక రైల్వే కోచ్ ల తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ఆలోచన ఉందని రుయా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ పవన్ కుమార్ రుయ చెప్పారు. గురువారం మధ్యాహ్నం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను పవన్ కుమార్ రుయ కలిశారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలనే ఆలోచనలో ఉన్నట్లు, రైల్ కోచ్ ల తయారీ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూరప్ కు చెందిన కంపెనీతో కలిసి ఫ్యాక్టరీ నెలకొల్పాలని భావిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా హైదరాబాద్ పరిధిలో ఒక స్మార్ట్ సిటీని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉందని సీఎంకు చెప్పారు.  దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతి పెద్దదైన మెట్రో రైల్ హైదరాబాద్ లో ఉందని, దానిని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

హైదరాబాద్ లో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, రుయ కంపెనీ ఇక్కడికి వస్తే వారి పరిశ్రమలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రుయ కంపెనీ ప్రతిపాదనలపై పూర్తిగా చర్చించాలని, కంపెనీకి కావాల్సిన వాటిని గుర్తించాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ జితేందర్ రెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అదేరోజు మధ్యాహ్నం ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ కంపెనీ కియోలిస్ ఎండీ, గ్లోబల్ సీఈవో బెర్నార్డ్ టేబరీ కూడా సీఎం కేసీఆర్ ను క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. కియోలిస్ కంపెనీ ప్రజారవాణా, మెట్రో నిర్వహణ, బస్, లైట్ రైల్ తదితర వ్యవస్థలను ప్రపంచవ్యాప్తంగా వాషింగ్టన్, పారిస్, లండన్, బోస్టన్, మెల్ బోర్న్ వంటి ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తున్నది. అంతేకాకుండా హైదరాబాద్ మెట్రో ఆపరేటర్ గా కూడా ఉంది. హైదరాబాద్ నగరంపై ముఖ్యమంత్రికి ఉన్న విజన్ ను ఈ సందర్భంగా బెర్నార్డ్ టేబర్ ప్రశంసించారు.

మెట్రో ప్రాజెక్టు హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని, ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ మెట్రో ప్రాజెక్టు అయిన దీనిని ఇంజినీరింగ్ పరంగా, ఆర్ధికపరంగా వినూత్నంగా డిజైన్ చేశారన్నారు. రైలు, బస్సు, మెట్రోలను సమన్వయం చేస్తూ, ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండానగరంలో ప్రయాణించేలా రూపొందించారని, మెట్రో ప్రారంభం అయిన తర్వాత నగర రూపురేఖలు మారిపోతాయని బెర్నార్డ్ పేర్కొన్నారు.

అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, మెట్రో ప్రయాణం అత్యంత భద్రత కలిగి ఉండేలా చూడాలని, సాధారణ ప్రజలు, నిరక్షరాస్యులు కూడా ప్రయాణించేలా అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేయాలనీ సూచించారు. హైదరాబాద్ మెట్రో రైల్ కోసం ఆపరేటింగ్, మెయింటెనెన్స్ ఇంజినీర్లను, సిబ్బందిని నియమించే సమయంలో తెలంగాణకు చెందిన వారై ఉండాలని, మెట్రో రైల్ రిక్రూట్ మెంట్లలో స్థానికులకు అవకాశం కల్పించాలని కోరగా అందుకు బెర్నార్డ్ సానుకూలంగా స్పందించారు. స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలకు తమ మేనేజర్లను పంపి క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, వీలున్న చోట్ల మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూస్తామని సీఎంకు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *