mt_logo

సీఎం కేసీఆర్ తో కేంద్రమంత్రి పీయూష్ భేటీ..

గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో కేంద్ర విద్యుత్ శాఖామంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను ఏవిధంగా అధిగమించిందీ సీఎం కేసీఆర్ కేంద్రమంత్రికి ఈ సందర్భంగా వివరించారు. మొదటి ఏడాదిలోనే కరెంట్ కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయడం పట్ల సీఎం కేసీఆర్ ను మంత్రి అభినందించారు. దేశంలోనే మరే రాష్ట్రం చేయనివిధంగా ఒకే సంవత్సరంలో 2500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన పీయూష్ సౌర విద్యుత్ విధాన పత్రాన్ని తనవెంట తీసుకుపోయారు.

రాష్ట్రంలో నెలకొల్పే థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గును కేటాయించాలని, నార్త్ గ్రిడ్ నుండి సౌత్ గ్రిడ్ కు విద్యుత్ సరఫరా అయ్యేలా ట్రాన్స్ మిషన్ కారిడార్ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తిచేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన పీయూష్ గోయల్ ఈ అంశాలపై తాను ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని సీఎం కేసీఆర్ కు హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్రానికి అవసరమైన బొగ్గు కేటాయించాలని కోరుతూ ఒక లేఖ, ట్రాన్స్ మిషన్ లైన్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ ప్రధాని మోడీకి, కేంద్రమంత్రికి రాసిన లేఖలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా పీయూష్ గోయల్ కు అందజేశారు.

తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను సీఎం కేంద్రమంత్రికి వివరించారు. వీధి లైట్లకు ఖచ్చితంగా ఎల్ఈడీ బల్బులనే వాడాలని, దీనివల్ల విద్యుత్ బాగా ఆదా అవుతుందని పీయూష్ చెప్పగా, కేసీఆర్ మాట్లాడుతూ ఇప్పటికే చాలా పట్టణాల్లో ఎల్ఈడీ బల్బులతో వీధిలైట్లు ఏర్పాటు చేశామని, ఏడాదిలోగా తమ రాష్ట్రంలోని అన్ని వీధి లైట్లకు ఎల్ఈడీ బల్బులను వాడటానికి ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జీ జగదీశ్ రెడ్డి, ఎంపీ కవిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *