తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకు శాంతిభద్రతలు దిగజారిపోతున్నాయి. రాష్ట్రంలో సంవత్సరం నుండి హోంమంత్రి లేడు సీఎం రేవంత్ రెడ్డి వద్దనే హోం శాఖ ఉంది అని అన్నారు.
రేవంత్ రెడ్డి పోలీసు ఆమరవీరుల స్మారక దినోత్సవంలో పాల్గొన్న రోజే.. పోలీస్ కానిస్టేబుల్స్ కుటుంబాలు రోడ్డు ఎక్కాయి. కేసీఆర్ కానిస్టేబుల్స్‌ను మనుషులుగా చూశారు.. రేవంత్ మరమనుషులుగా చూస్తున్నారు అని దుయ్యబట్టారు.
కానిస్టేబుల్స్ భార్యలు రోడ్డు ఎక్కితే నల్గొండలో కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేశారు..భార్యలు రోడ్డు ఎక్కితే భర్తలను సస్పెండ్ చేసే చట్టం ఎక్కడా లేదు. వెంటనే పోలీస్ కానిస్టేబుల్స్ సస్పెన్షన్ ఎత్తివేయాలి అని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. స్పెషల్ కానిస్టేబుల్స్ 15 రోజులు డ్యూటీ చేస్తే 4 రోజులు సెలవులు గతంలో ఉండేవి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 26 రోజులు కంటిన్యూ డ్యూటీ చేస్తే 4 రోజులు లీవ్ ఇస్తామని అంటున్నారు అని విమర్శించారు.
పోలీసు శాఖ సమ్మె చేయడం అంటే దేశ భద్రత కోణంలో చూడాలి.. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏక్ పోలీసు నినాదం అన్నారు ఏక్ పోలీసు నినాదం ఏమైంది రేవంత్ రెడ్డి. పోలీసులు మీకు, మీ మంత్రులకు భద్రత కల్పిస్తున్నారు. పోలీసుల భద్రత కార్డులు హాస్పిటల్స్‌లో పనిచేయడం లేదు అని ఆరోపించారు.
అంబర్‌పేట్‌లో రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ లింగారెడ్డి దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పటి వరకు పోలీసులు ఒక్క నిందితుడిని అరెస్టు చేయలేదు. బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తపై గొడ్డలితో దాడి చేశారు. బీఆర్ఎస్ హయాంలో పెట్టిన సీసీ కెమెరాలు ఇప్పటి వరకు పని చేయడం లేదు అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్లపై ఎన్ని కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తున్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం రోజు డీజీపీ నాకు ఆహ్వానం పంపారు. నేను బయటకు వెళ్తానంటే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోలీసు శాఖలో అశాంతి నెలకొంది అని అన్నారు.
మైనంపలి హన్మంతరావు గజ్వేల్‌లో కేటీఆర్, హరీష్ రావుపై పెట్రోల్ పోసి చంపుతాను అంటే ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. పీటీ వారెంటులు పెట్టి కొత్త కేసులు పెడుతున్నారు. కొల్లాపూర్‌లో శ్రీధర్ రెడ్డిని హత్య చేస్తే ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదు. ఏడు నెలలు అయినా నిందితులను అరెస్టు చేయలేదు జూపల్లి కృష్ణారావు హస్తం ఉందని శ్రీధర్ రెడ్డి తండ్రి డీజీపీకి ఫిర్యాదు చేశారు అని తెలిపారు.
ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి చేతులు దులుపుకున్నారు.. బాగ్ అంబర్‌పేట్‌లో లింగారెడ్డి దంపతుల హత్య జరిగి ఏడు రోజులు అయినా నిందితులను పట్టుకోలేదు. శ్రీధర్ రెడ్డి హత్యలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పాత్రపై విచారణ చేయాలి అని కోరారు.