అంబర్‌పేట్‌లోని సాయిబాబా కాలనీలో హత్యకు గురైన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ లింగారెడ్డి దంపతుల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అంబర్‌పేట్‌లోని సాయినగర్ కాలనీలో లింగారెడ్డి, ఉర్మిళ అనే 80 ఏళ్ళు పైబడ్డ వృద్ధ దంపతులను పట్టపగలు వారి ఇంటిపై దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు ఈ జంట హత్యల ఘటన హైదరాబాద్‌లోని ప్రతి మనిషిని, మనసు కలిచివేసింది అని విచారం వ్యక్తం చేశారు.
లింగారెడ్డి గారి ముగ్గురు కుమార్తెలు అమెరికాలో ఉన్నారు. హైదరాబాద్ లాంటి ప్రశాంతమైన నగరంలో ఇలాంటి సంఘటన జరగటంతో వారంతా షాక్‌లో ఉన్నారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పేందుకే స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారితో కలిసి వచ్చాను అని అన్నారు.
కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏ బస్తీకి ఆ బస్తీ, ఏ గల్లీకి ఆ గల్లీ, ఏ కమ్యూనిటికీ ఆ కమ్యూనిటీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. సిటిజన్ పోలీసింగ్ కూడా ఏర్పాటు చేశాం. పోలీసులకు సరైన వ్యవస్థ, స్వేచ్ఛను ఇచ్చి వారి పని వారిని చేయనిస్తే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి అని వ్యాఖ్యానించారు.
ఈ జంట హత్య కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు లేవు, దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటూ స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారే చెబుతున్నారు. నిన్న జగిత్యాలలో జీవన్ రెడ్డి అనుచరుడిని హత్య చేశారు. ఇక్కడ హైదరాబాద్‌లో వృద్ధ జంటను కిరాతకంగా హత్య చేశారు అని విమర్శించారు.
జంట హత్యలు జరగటంతో హైదరాబాద్‌లో ప్రజలు భయంతో ఉన్నారు. సాయిబాబా కాలనీలో సీసీ కెమెరాలు పనిచేయటం లేదని స్థానికులు చెబుతున్నారు అని కేటీఆర్ ఆరోపించారు.
నేను హైదరాబాద్ సీపీ గారిని, పోలీసులను నగరంలో శాంతి, భద్రతలు అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నా జంట హత్యలకు పాల్పడిన నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని.. ఈ హత్య కేసులో నిందితులను ప్రజల ముందుంచాలని కోరుతున్నా అని అన్నారు.