mt_logo

ధరణి పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్లు..

తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్ బుక్ ల బిల్లు-2020, వీఆర్వో రద్దు బిల్లు, తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు బిల్లు, పంచాయితీ రాజ్ 2020 సవరణ బిల్లు, పురపాలక చట్టం 2020 సవరణ బిల్లులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నూతన రెవెన్యూ చట్టంపై శాసనసభలో చర్చ ముగిసిన అనంతరం ఈ బిల్లులకు ఆమోదం తెల్లిపారు. ఈ సందర్భంగా సభ్యులంతా బల్లలు చరుస్తూ మద్దతు ప్రకటించారు. నూతన రెవెన్యూ బిల్లును ఈ నెల 9 న సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై శుక్రవారం సుదీర్ఘంగా చర్చ జరగగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో భూమి రిజిస్ట్రేషన్లన్నీ ఇకపై ధరణి పోర్టల్ ద్వారానే జరగనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ప్రవేశపెడ్తున్న ధరణి పోర్టల్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించనున్నట్లు, ప్రైవేట్ కు అప్పజెప్పబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న టీఎస్ టీఎస్ కార్పొరేషన్ ద్వారా ధరణి పోర్టల్ ను నిర్వహిస్తామని చెప్పారు. ధరణి పోర్టల్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భూ రికార్డుల విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు.

భూ రికార్డులను మూడు రకాలుగా(ఈ-రికార్డు, డిజిటల్ రికార్డు, డాక్యుమెంట్ రూపంలో) భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ధరణి వెబ్ సైట్ ఒకే సర్వర్ మీద ఆధారపడకుండా దేశంలో ఎక్కడ భద్రమైన ప్రాంతాలు ఉంటాయో అక్కడ సర్వర్లు ఉంటాయని వివరించారు. సర్వర్ల కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని, వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాస్ బుక్, వ్యవసాయేతర భూములకు ముదురు ఎరుపు రంగు పాస్ బుక్ ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *