జీహెచ్ఎంసీతో పాటు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయితీల పరిధిలో లే అవుట్ రెగ్యులరైజేషన్ పథకం(ఎల్ఆర్ఎస్) ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఆగస్ట్ 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అయిన అనధికార ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకోసం జీవో నం. 151 విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 15 ను ఆఖరి తేదీగా నిర్ణయించింది. ఈ స్కీమ్ ను సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది ముందుకొస్తున్నారు. అనధికారిక లే అవుట్లను క్రమబద్ధీకరించుకోవడం ద్వారా అధికారులనుండి భవన నిర్మాణాలకు అనుమతి పొందవచ్చు. ఫ్లాట్ల యజమానులందరూ అవసరమైన రుసుము చెల్లించడం ద్వారా రోడ్లు, నీటి సరఫరా, డ్రైనేజీ, వీధి దీపాలలాంటి అనేక సౌకర్యాలు పొందవచ్చు. అనధికార లే అవుట్ ప్రదేశాలు కూడా పట్టణ లేదా నగర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాయి.
క్రమబద్దీకరణ చేయించకుంటే భవన నిర్మాణాల కోసం అధికారులు అనుమతులు ఇవ్వరు. చట్టప్రకారం జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. ఇతర సౌకర్యాలు కూడా రావు. ఫ్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్ళు, ఇతర లావాదేవీలు ఆగిపోతాయి. చెరువులు, కుంటలు, నాలాలు, శిఖం భూములు, 111 జీవో పరిధిలోని భూములు, మాస్టర్ ప్లాన్ లో పరిశ్రమలకు కేటాయించిన భూములు, రీక్రియేషన్ జోన్ లో ఉండే చెరువులు, కుంటలు, ఓపెన్ స్పేస్ వంటి భూములను క్రమబద్ధీకరించరు. విమానాశ్రయాలు, రక్షణ శాఖ భూములకు 500 మీటర్ల లోపు ప్రాంతాలు, వివాదాస్పదంలో ఉన్న భూములు, కోర్టు పరిధిలో ఉన్న స్థలాలు, సీలింగ్ భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్, వక్ఫ్/దేవాదాయ శిఖం భూములకు ఈ ఎల్ఆర్ఎస్ పథకం వర్తించదు.
వ్యక్తిగత ప్లాటు క్రమబద్ధీకరణ దరఖాస్తు ఫీజు రూ. 1000, డెవెలపర్లు అయితే లే అవుట్ క్రమబద్ధీకరణ కోసం రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 10,000 చెల్లించాలి. ఆన్ లైన్ లో కానీ, మీ సేవా కేంద్రాల్లో కానీ ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోన్ లో కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందించారు. ప్లే స్టోర్ నుండి కానీ క్రోమ్ నుండి కానీ ఎల్ఆర్ఎస్-2020 యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 131 లో క్రమబద్ధీకరణ, ఓపెన్ స్పేస్ చార్జీలను ప్లాటు విస్తీర్ణం, మార్కెట్ విలువ ఆధారంగా ఎలా లెక్కించాలనే విషయంపై పలు మార్గదర్శకాలను పొందుపరిచారు.