ఎవరు అవునన్నా కాదన్నా మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక రెడ్డి కులస్తులు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశారన్నది బహిరంగ రహస్యమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెడ్డి, కమ్మ కులాల మధ్య అధికారం కేంద్రీకృతం అయ్యి ఉండేది. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో రెడ్డిలకు తగు ప్రాధాన్యతే దక్కినా కూడా రేవంత్ వంటి నాయకులు చేసిన విషప్రచారం వల్ల రెడ్డిల్లో కొంతమందైనా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు.
అధికారంలోకి వచ్చాక తొలిరోజుల్లో జరిగిన నియామకాల్లో కొంత రెడ్డిలకు పెద్ద పీట వేసినట్టే కనపడింది. కానీ ఈ మధ్య రేవంత్ వరుసగా చేస్తున్న తప్పులతో రెడ్డిల్లో మెల్లగా ఆయన పేరు మసకబారడం కనిపిస్తోంది.
తాజాగా శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తున్న ఎదురుదాడితో కొంత ఆత్మరక్షణలో పడ్డ రేవంత్ రెడ్డి ప్రతిదాడి చేసేక్రమంలో అనుకోకుండా నోరుజారి మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రా రెడ్డి, సునితా లక్ష్మా రెడ్డిల మీద చేసిన దుందుడుకు వ్యాఖ్యలు రెడ్డి సామాజిక వర్గానికి ఆగ్రహం తెప్పించాయి.
అసలు జరుగుతున్న చర్చతో ఏమాత్రం సంబంధం లేని సబితా ఇంద్రా రెడ్డి, సునితా లక్ష్మా రెడ్డిలను దూషించడం ద్వారా రేవంత్ తేనెతుట్టెను కదిపినట్టయ్యింది. స్వతహాగా ఈ ఇద్దరు నాయకురాళ్ళు వివాదరహితులు, సౌమ్యులు అన్న పేరు ఉంది. దురదృష్టవశాత్తూ ఇద్దరూ చిన్నవయసులోనే భర్తలను పోగొట్టుకుని ధైర్యంగా ప్రజాజీవితంలోకి వచ్చి పలుమార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు.
అలాంటి నాయకురాళ్లను తన మొరటు భాషతో అవమానించిన రేవంత్ పట్ల రెడ్డి పరివార్‌లో కోపం నషాళానికి అంటిందట. గ్రామీణ ప్రాంతాలోని రెడ్డి సామాజిక వర్గపు వాట్సాప్ గ్రూపుల్లో రేవంత్ మీద రాయలేని భాషలో మెసేజులు పెడుతున్నారు ఆ వర్గానికి చెందిన యువకులు.
అయితే రేవంత్ రెడ్డి మీద రెడ్డి సామాజిక వర్గం ఆగ్రహానికి రావడం ఏదో సడెన్‌గా జరిగిన పరిణామం కాదని సామాజిక విశ్లేషకులు అంటున్నారు. గత నెలలో హైదరాబాదులో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కేజీఎఫ్) మీటింగుకు రేవంత్ హాజరయ్యి కమ్మ కులస్తులను ఆకాశానికి ఎత్తేయడం చాలామంది రెడ్డిలకు నచ్చలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండే ఉప్పు-నిప్పు లాగా ఉంటున్న ఈ రెండు కులాలు ఒక ఒరలో ఇమిడేవి కావు.
ఇప్పుడు ఆంధ్రలో కూడా ప్రధాన పోరు ఈ రెండుకులాలు కొమ్ముకాసే రెండు రాజకీయ పార్టీల మధ్యనే కావడం గమనార్హం. వాస్తవాలు ఇలా ఉండగా చంద్రబాబు నాయుడు కూడా హాజరుకాని కమ్మ కులం మీటింగ్‌కు రేవంత్ రెడ్డి హాజరు కావడం. అందులో కమ్మలను పొగడ్తలతో ముంచేయడం ఆయన రెడ్డిలలో తీవ్ర కోపాన్ని రగిలించింది.
ఇక రాష్ట్రంలోని రైతుబంధు లబ్దిదారుల్లో గణనీయ సంఖ్యలో ఉన్న రెడ్డి రైతులు కూడా రేవంత్ అకస్మాత్తుగా రైతుబంధును ఆపేయడం వల్ల కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు.
అంతర్గతంగా కొంతకాలంగా ఎక్కువైతున్న ఈ వ్యతిరేకత ఇవ్వాళ శాసనసభలో ఇద్దరు రెడ్డి మహిళా ఎమ్మెల్యేల మీద రేవంత్ చేసిన వ్యాఖ్యలతో భగ్గుమన్నది.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో రెడ్డు కుల ఆగ్రహాగ్నికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ భస్మం అయ్యే లక్షణాలు అయితే తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.