mt_logo

రెండుగా విడిపోనున్న పోలీసు శాఖ

రాష్ట్రవిభజన ప్రక్రియకు సంబంధించి రాష్ట్రపతి గెజిట్ విడుదలైన వెంటనే అన్ని ప్రభుత్వశాఖల విభజన వేగవంతం చేయాలని గవర్నర్ అధికారులను గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే పోలీసు శాఖలోని రిక్రూట్ మెంట్ బోర్డ్, అప్పా, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తదితర విభాగాలను ఉమ్మడిగానే ఉంచాలని తొలుత నిర్ణయించారు. వెంటనే విభజిస్తే సమస్యలు వస్తాయని, కనీసం రెండు, మూడేళ్ళు ఉమ్మడిగా కొనసాగిస్తే మంచిదని అధికారులు భావించారు. కానీ ప్రస్తుతపరిస్థితుల్లో పోలీస్ శాఖ మొత్తాన్ని రెండుగా విభజించాలని, అందులో భాగంగా పోలీస్ శాఖలో ఏఏ విభాగాలు ఉన్నాయి? ఎంతమంది ఉద్యోగులు? వారి స్థానికత ఏమిటి? అన్న వివరాలను సేకరిస్తున్నారు.

రిక్రూట్ మెంట్ విభాగాన్ని వెంటనే రెండుగా విడదీయాలంటే ముందుగా ఫైళ్ళ విభజన జరగాలని, ఇది ఎక్కువకాలం కొనసాగే ప్రక్రియ కాబట్టి కనీసం రెండేళ్ళయినా ఉమ్మడిగా ఉంచాలని భావించారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీని విడగొడితే ఇప్పటికిప్పుడు అనుభవమున్న, నిపుణులైన సైంటిస్టులు దొరికే పరిస్థితి లేదు కాబట్టి, పోలీసు సిబ్బందికి కొన్ని అంశాల్లో ప్రత్యేక శిక్షణలో భాగంగా 150 మంది ఏఎస్సై లకు వేలిముద్రల సేకరణలో శిక్షణ ఇప్పించారు. పూర్తి స్థాయిలో శిక్షణ పూర్తైన తర్వాతనే సీమాంధ్రలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నారు.

మావోయిస్టులను అణచివేసేందుకు నియమించబడ్డ గ్రేహౌండ్స్ సిబ్బందికి కమెండో తరహా శిక్షణ ఇస్తారు. సీమాంధ్రలో అలాంటి శిక్షణ ఇవ్వాలంటే కనీసం మూడేళ్ళయినా పడుతుందని భావించిన అధికారులు దీనిని కూడా ఉమ్మడిగానే కొనసాగించాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఆక్టోపస్, ఎస్ఐబీలను కూడా ఉమ్మడిగానే ఉంచాలనుకున్నా, శుక్రవారం జరిగిన సమావేశంలో పోలీసుశాఖలో మిగతా విభాగాలతో పాటు ఉమ్మడిగా కొంతకాలం ఉంచాలనుకున్న గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, రిక్రూట్ మెంట్ విభాగాలను కూడా విభజించాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

రెండు విభాగాల నిర్వహణకు అవసరమైన నిధులను కేంద్ర హోం శాఖ భరిస్తుందని కేంద్రప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చింది. కాగా సీమాంధ్రలో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం, ఆక్టోపస్ విభాగాల ఏర్పాటుకు ఎన్ని నిధులు అవసరమౌతాయన్న విషయంపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ, ఇంటలిజెన్స్ డీజీ మహేందర్ రెడ్డి, సీనియర్ పోలీస్ అధికారులు సజ్జనార్, నండూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *