శుక్రవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమిషనర్ ఎన్ అశోక్ రెడ్డి పదవీ విరమణ సందర్భంగా జరిగిన ‘తెలంగాణ పునర్నిర్మాణం- ఉద్యోగుల పాత్ర’ పై జరిగిన సదస్సులో వివిధ విభాగాలకు చెందిన మేధావులు పాల్గొన్నారు. వారిలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం, ప్రొ. హరగోపాల్, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, మాజీ ఎంపీ వివేక్, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యదర్శి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పదవీ విరమణ చేసిన అశోక్ రెడ్డిని వారంతా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ, నిబద్ధతతో కూడిన నిర్ణయాలు తీసుకుని, వాటిని సమర్ధవంతంగా అమలుచేసే అధికార వ్యవస్థ ఉన్ననాడే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని, నవ తెలంగాణలో అలాంటి నిబద్ధత ఉన్న నేతలు కావాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేసే మార్గం దొరికిందని ఉద్యోగులు భావించాలని, తెలంగాణ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని సూచించారు.
గుత్తాధిపత్యం కోసం ఉద్యోగుల ఆప్షన్లు అంటున్నారని, మా వాటా మాకు కావాలంటే దానిని ప్రాంతీయ మౌడ్యంగా చూస్తున్నారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అధికారం దూరంగా ఉన్న సమాజంలో ఇన్నాళ్ళూ బతికామని, వివక్షకు ఇదే ప్రధాన కారణమైందని ఆయన పేర్కొన్నారు. ప్రొ. హరగోపాల్ మాట్లాడుతూ, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయని, సమస్యలు, భయాలు ప్రజలతో పంచుకునే అవకాశం నమస్తే తెలంగాణ పత్రిక ద్వారా కలిగిందని వివరించారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ, తెలంగాణ సాధన కోసమే తాను కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి వెళ్లానని చెప్పారు.
ఎవరెన్ని అనుకున్నా మన రక్తంతో తెలంగాణ ఉద్యమం నడిపామని, రాజకీయ పార్టీలు ద్రోహాలకు పాల్పడి మాటమీద నిలవనప్పుడు ఉద్యమాన్ని నడిపింది తెలంగాణ ప్రజలేనని అల్లం నారాయణ అన్నారు. కోదండరాం లాంటి వ్యక్తులు ఎన్నికల్లో గెలవాలన్నా పదికోట్లు ఖర్చుపెట్టే పరిస్థితి ఉందని, కేసీఆర్ తాటతీస్తా అన్న వ్యక్తి పిచ్చోడు కాక ఏమవుతాడని ఆయన మండిపడ్డారు. దేవీ ప్రసాద్ మాట్లాడుతూ, గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర సచివాలయం వరకూ తెలంగాణ ఉద్యోగులే ఉండాలని స్పష్టం చేశారు.