mt_logo

ప్రభుత్వ శాఖల విభజన షురూ…

జూన్ 2వ తేదీ నాటికి రెండు రాష్ట్రాల అపాయింటెడ్ డే ఉండటంతో ప్రభుత్వశాఖల విభజన వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నెల 25కల్లా విభజన పూర్తి చేయాలని, జూన్ రెండున ఏర్పడబోతున్న రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారికంగా పాలనా వ్యవహారాలు ప్రారంభించేలా చూడాలని అధికారులకు మహంతి శుక్రవారం డెడ్ లైన్ విధించారు. భారీ నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, రవాణా శాఖ, రోడ్లు భవనాల శాఖ, ప్రణాళిక శాఖ, ప్రోటోకాల్ శాఖ, ఐటీ, రాష్ట్ర పునర్విభజన విభాగం మొదలైన శాఖల విభజన ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఈనెల 5కల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మంత్రులకు సంబంధించిన కార్యాలయాలను, రెండు రాష్ట్రాల సచివాలయాలను, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, చట్టసభలు, నివాస భవనాలను ఇరు రాష్ట్రాలకు కేటాయించే పనులు పూర్తి చేయడం, 6వ తేదీ కల్లా స్థిరాస్తులు, వాహనాలు, ఐటీ హార్డ్ వేర్ కు సంబంధించిన వాటిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడం. 10కల్లా న్యాయపరమైన అంశాలు, ఉన్నత విద్య, వైద్యవిద్య, హార్టీ కల్చర్, అగ్రికల్చర్, న్యాయశాఖ మొదలైన విభాగాలను విభజించడం. ఏపీ ట్రాన్స్ కో, సింగరేణి, ఏపీ జెన్కో తదితర సంస్థలకు చెందిన వివిధ కార్యక్రమాలు పూర్తి చేయడం, సచివాలయంలోని కార్యదర్శులు, ఇతర ఉద్యోగులకు కార్యాలయాల కేటాయింపు, కేంద్రప్రభుత్వం నుండి కొత్త రాజధానికి అవసరమైన అత్యవసర వసతుల కల్పన.
15వ తేదీ నాటికల్లా కేంద్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలనుంచి విద్యుత్ కేటాయింపుల ప్రకటనకు తుది గడువు ముగుస్తుంది. ఏపీ ట్రాన్స్ కో, ఏపీ జెన్ కో, సెంట్రల్ పవర్ సిస్టం, సదరన్ పవర్ డిస్కంల ఆస్తులు, అప్పులు, పెట్టుబడులు, రుణాలు, ఈక్విటీ, ఉద్యోగులు మొదలైన అంశాలను ఈ సంవత్సరానికి సంబంధించి రెండురాష్ట్రాల బడ్జెట్ డిమాండ్స్ లో పేర్కొనడం. 20కల్లా రెండు రాష్ట్రాల్లో తాత్కాలికంగా రోడ్ పర్మిట్లను అనుమతిస్తూ టోల్, ఎంట్రన్స్ ఫీజు, ఇతర చార్జీల మినహాయింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.
25వ తేదీ నాటికి రెండు రాష్ట్రాలకు సంబంధించి సాగునీటి పంపకాలు, గోదావరి, కృష్ణా రివర్ మేనేజిమెంటు బోర్డుల ఏర్పాటు ప్రక్రియ, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తూ నోటిఫికేషన్, తుంగభద్ర బోర్డులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాతినిధ్యం, తెలంగాణ రాష్ట్రానికి పోస్టుల కేటాయింపు, ఉద్యోగుల బదలాయింపుపై జాబితా, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పునరుద్ధరణ, సచివాలయంలోని రెండు ప్రభుత్వాలకు టెలిఫోన్, ఐటీ సదుపాయాలను కల్పించడంలాంటి తదితర కార్యక్రమాలను నిర్వర్తించేలా పీకే మహంతి ఉన్నతాధికారులకు ఆజ్ఞలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *