జిల్లాల సంఖ్యను 17కు కుదించాలన్న రేవంత్ రెడ్డి తాజా నిర్ణయం తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి అల్లకల్లోలం సృష్టించనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క వ్యక్తి అహాన్ని సంతృప్తిపరచడానికి చేస్తున్న ఈ పిచ్చి పని తెలంగాణను పదేళ్లు వెనక్కి తీసుకుపోయే ప్రమాదం ఉన్నది.
తెలంగాణలో ఇప్పుడున్న 33 జిల్లాలను రద్దు చేసి కేవలం 17 పార్లమెంటు స్థానాలను జిల్లాలుగా ప్రకటించాలని రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ అసంబద్ధ నిర్ణయం వల్ల జరిగే నష్టాలు అన్నీ ఇన్నీ కావు.
తొలుత ఈ నిర్ణయం వల్ల భారీగా నష్టపోయేది ఉద్యోగార్ధులైన తెలంగాణ యువత. జిల్లాల పునర్విభజన వల్ల ఇప్పుడున్న జోనల్ వ్యవస్థ నిష్ఫలం అయ్యి మళ్లీ కొత్తగా కేంద్రం నుండి, రాష్ట్రపతి నుండి కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదముద్ర తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మరో రెండేళ్ళ పాటు ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడానికి వీలుకాదు.
ఈ అవకతవక నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోయేవారు తెలంగాణ రైతాంగం. కొత్త జిల్లాల వల్ల సుమారు 30 టౌన్లలో భూముల ధరలు పెరిగి ఆర్థికంగా కొంత నిలదొక్కుకున్నరు తెలంగాణ రైతులు. ఇప్పుడు రేవంత్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో భూముల ధరలు దారుణంగా పడిపోయి మళ్లీ ఆర్థిక ఒడిదొడుకులకు లోనవుతారు. ఇక రియల్ ఎస్టేట్ పరిశ్రమ వారికైతే ఇది మరణశాసనమే.
కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల అనేక ఇబ్బందులకు గురయ్యే వారిలో మరో ప్రధాన వర్గం ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పటికే 33 జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు జరిగి జిల్లా ఆఫీసుల్లో అందరూ కుదురుకున్నారు. ఇప్పుడు మళ్లీ కొన్ని లక్షల మంది ఉద్యోగులకు స్థానచలనం కలగన్నుంది. వీళ్లంతా తట్టాబుట్టా సర్దుకుని మళ్లీ కొత్త ఊర్లకు వెళ్లాల్సి ఉంటుంది. దీనితో పిల్లల చదువులతో పాటు అన్నీ డిస్టర్బ్ అవడం ఖాయం.
అంతే కాదు వందల కోట్ల రూపాయల వ్యయంతో 33 జిల్లా కేంద్రాల్లో నిర్మించిన జిల్లా ఆఫీసులన్నీ ఈ ఒక్క నిర్ణయంతో వ్యర్ధం కానున్నాయి.
కేవలం కేసీఆర్ ఆనవాలు చెరిపేసేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ తుగ్లక్ ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు వెంటనే అడ్డుకోకపోతే తెలంగాణ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.