నల్గొండ జిల్లా దామరచర్ల వద్ద ఏర్పాటుచేయనున్న యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్ఈసీ) రూ. 16,070 కోట్ల రుణాన్ని అందజేసింది. ఆర్ఈసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ శర్మ మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును సచివాలయంలో కలిసి చెక్కును అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తికోసం అవసరమయ్యే నిధులను సమకూర్చే ఆర్ఈసీ మూడునెలల కిందట పాల్వంచలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నెలకొల్పేందుకు రూ. 4,321 కోట్ల రుణం మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టుల కోసం ఆర్ఈసీ నుండి ఇప్పటివరకు రూ. 20,391 కోట్లు అందాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయన్నారు. విద్యుత్ కు సంబంధించి అన్ని విధాలా సహకారం, ప్రోత్సాహం అందుతుండటంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం ఆర్ఈసీ చైర్మన్ అండ్ ఎండీ రాజీవ్ శర్మ మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి ఇంత మొత్తంలో నిధులు ఒకేసారి ఇవ్వడం తమ సంస్థ చరిత్రలోనే మొదటిసారి అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధి, ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం చేపట్టిన ప్రణాళికలపై ఉన్న నమ్మకంతోనే నిధులు ఇచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా విద్యుత్ ప్రాజెక్టు కోసం ఇచ్చే రుణానికి సాధారణంగా 11.5 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా, తెలంగాణకు ఇచ్చే రుణానికి 11 శాతం మాత్రమే తీసుకుంటున్నామన్నారు. వడ్డీ శాతం తగ్గడం వల్ల తెలంగాణకు రూ. 500 కోట్లకు పైగా ఆదా అవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, విద్యుత్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.