mt_logo

మిషన్ కాకతీయ చరిత్రను తిరగరాస్తుంది!!

తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం చరిత్రను తిరగరాస్తుందని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజేందర్ సింగ్ ప్రశంసించారు. చెరువులు కూడా వారసత్వ సంపదేనని, వాటిని పునరుద్ధరించడం గొప్ప కార్యక్రమమని అన్నారు. వరంగల్ జిల్లాలో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు బుధవారం హైదరాబాద్ వచ్చిన రాజేందర్ సింగ్ రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మిషన్ కాకతీయ గురించి అన్ని వివరాలను మంత్రి హరీష్ రావు రాజేందర్ సింగ్ కు వివరించారు. చెరువుల పరిరక్షణ కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానుందని, కాకతీయుల కాలం నాటి చెరువులను పునరుద్ధరిస్తున్నందున కాకతీయ అనే పేరును ఎంచుకున్నామని, అందుకే మిషన్ కాకతీయ అని నామకరణం చేశామని తెలిపారు.

అనంతరం రాజేందర్ సింగ్ మాట్లాడుతూ మూడు నెలలనుండి మిషన్ కాకతీయ గురించి వింటున్నానని, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి హరీష్ రావు, నీటిపారుదల శాఖ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కాకతీయుల కాలం నాటి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం గొప్ప విషయమని, ఇది చాలా పెద్ద మనసుతో చేపట్టిన కార్యక్రమమని, తెలంగాణ రాష్ట్రం సురక్షితమైన వారి చేతుల్లో ఉందని అభినందించారు. చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ట్రప్రభుత్వం రూ. 25వేల కోట్లు కేటాయించడం చరిత్ర అని, చెరువులపై ఇంత భారీగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణేనని, ఇతర రాష్ట్రాలు తెలంగాణను చూసి నేర్చుకోవాలని రాజేందర్ సింగ్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *