ఈ ప్రభుత్వానికి చెప్పినా.. గోడకు చెప్పిన ఒక్కటే అని విమర్శిస్తూ.. జీవో 46కు సంబంధించిన వినతి పత్రాన్ని బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి సెక్రటేరియట్ గోడకు అంటించారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలన పడకేసింది అనుకున్నాం.. కానీ అటకెక్కింది. ఈ ప్రభుత్వానికి పీఆర్ స్టంట్ల మీద ఉన్న సోయి.. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లేదు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, గురుకుల టీచర్లు ఆందోళన చేస్తుంటే పట్టింపు లేదు అని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో హత్యలు, హత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు..జీవో 46 బాధితులను పట్టించుకోవడం లేదు. 60 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం వస్తే..90 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం రాలేదు. వారికి న్యాయం చేస్తామని మాటిచ్చారు.. కాంగ్రెస్ కోసం పనిచేయాలని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోగానే మొహం చాటేశారు అని ధ్వజమెత్తారు.
ఇప్పుడు జీవో 46 బాధితులు కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. వాళ్ళు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావును కలిశారు. వారి పక్షాన మేము సీఎస్‌ను కలవడానికి వచ్చాం. 10 రోజులుగా చూస్తున్నాం.. అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వానికి చెప్పినా.. గోడకు చెప్పిన ఒక్కటే అని వినతి పత్రం సెక్రటేరియట్ గోడకు అంటించి వచ్చాం అని రాకేష్ రెడ్డి పేర్కొన్నారు.
జీవో 46 బాధితుల పక్షాన నిలుస్తున్నం.. వారికి న్యాయం జరిగే వరకు మేము కొట్లడుతాం. బీఆర్ఎస్ పార్టీ బాధితులకు అన్ని విధాల అండగా ఉంటుంది.. వారి పక్షాన మేము పోరాటం చేస్తాం అని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వారిని ప్రజా భవన్ పిలుచుకొని, వారితో భోజనం చేసి వారి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఉద్యమాల వల్ల ప్రభుత్వాలు చట్టాలనే వెనక్కు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రజా పాలన అని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం జీవో 46ను వెనక్కి తీసుకోవాలి లేదా సవరణ చేయాలి అని డిమాండ్ చేశారు.