నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్వీ కార్యకర్తలు రాజ్ భవన్‌ను ముట్టడి చేశారు.. పరీక్షను రద్దు చేయాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్వీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు నీట్ పరీక్ష అవకతవకలపై ఎందుకు స్పందించలేదు. గవర్నర్ చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలి.. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు.
దీనిపై వెంటనే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించకపోతే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతాం అని హెచ్చరించారు. నీట్ పరీక్ష అక్రమాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని భావిస్తున్నాం. ముఖ్యమంత్రి స్పందించకపోతే వారి కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం అని శ్రీనివాస్ అన్నారు.