mt_logo

సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలన్న ఆలోచన విరమించుకోవాలి: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

తెలంగాణ సచివాలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆలోచనలు విరమించుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించి ప్లాన్ చేయడం జరిగింది. ఈ లోపున ఈ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రదేశంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించడం ఖండనీయం అని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ ఉద్యమ అస్థిత్వాన్ని మరుగుపరచే విధంగా.. తెలంగాణ ఆనవాళ్లు తుడిచివేసే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ, ఆంధ్ర వలసవాదుల, ప్రవాస ఆంధ్ర మేధావుల సలహాలతో తెలంగాణ తల్లిని కించపరుస్తూ, చరిత్ర కలిగిన కాకతీయులను, గోల్కొండ నవాబులను ఇప్పటికే కించపరుస్తూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు అని గుర్తు చేశారు.

తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని విరమించుకోవాలని భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నది అని స్పష్టం చేశారు.