రాష్ట్రంలో నెలకొల్పిన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గురుకుల తరహా బోధన అందుబాటులోకి తెచ్చి అందరికీ నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తానని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గంలో తనకు రెండోసారి మంత్రిపదవి కల్పించడంపై సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ కేజీ టు పీజీ విద్యావిధానానికి రూపకల్పన చేశారని, రాష్ట్రంలో ప్రతి విద్యార్థి తన చదువు ముగించుకుని కళాశాల నుండి బయటికి వెళ్ళే సమయానికి ప్రపంచంలోనే ఎవరితోనైనా పోటీపడి తలెత్తుకుని నిలబడేలా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.
సమైక్య రాష్ట్రంలో గత పాలకులు విద్యారంగంలో అవసరం లేకపోయినా వందలు, వేల సంఖ్యలో జీవోలు తీసుకొచ్చారు. ఒక ఉపాధ్యాయుడు జీవితకాలంలో చదవలేని జీవోలు ఉన్నాయి. వీటిని మార్చాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. విద్యారంగంపై సీఎం కు ప్రత్యేకమైన ఆలోచనలున్నాయి. టీచర్ల రిక్రూట్మెంట్ కు సంబంధించి అవసరమైన చోట్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వం మొదటి విడతలో విద్యాశాఖలో, గురుకులాల్లో అవసరమైన పోస్టులు భర్తీ చేసింది. భాషా పండితులకు, పీఈటీలకు పదోన్నతులు ఇచ్చి వారి దీర్ఘకాల సమస్యను ఇటీవలే పరిష్కరించింది. ఉపాద్యాయుల సమస్యలను పరిష్కరించేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
త్వరలో ప్రైవేట్ వర్సిటీలు వచ్చే అవకాశం ఉంది. వీటివల్ల నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుంది. అదేసమయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలను కూడా బలోపేతం చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలను నియంత్రించే చర్యలు కొనసాగుతాయని, చట్టం ముందు అందరూ సమానమేనని, ఇంజినీరింగ్ కాలేజీల విషయంలో సొంత పార్టీ నాయకుల విద్యాసంస్థలనూ మూసేసామని జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు. ప్రాథమిక పాఠశాలల నుండి ఉన్నత విద్యాసంస్థల వరకు ప్రక్షాళన మొదలైంది. ప్రైవేటు స్కూళ్ళలో ఫీజులకు సంబంధించిన అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. గతంలో మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం మంత్రుల వద్దకు సిఫార్సు కోసం వచ్చేవారు. కానీ మూడేళ్ళుగా గురుకులాల్లో సీట్లు ఇప్పించాలంటూ తల్లిదండ్రులు వస్తున్నారు. సీఎం కేసీఆర్ అమలుచేసిన పలు సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నాయని జగదీశ్ రెడ్డి వివరించారు.