mt_logo

హైదరాబాద్ లో గూగుల్ అతిపెద్ద క్యాంపస్!!

అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు కొలువైన హైదరాబాద్ నగరంలో మరో కార్పొరేట్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్యాలయం త్వరలో ఏర్పాటు కానుంది. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ గూగుల్ త్వరలో హైదరాబాద్ లోని నానక్ రాం గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అతిపెద్ద క్యాంపస్ ను ఏర్పాటు చేయనుంది. అమెరికా బయట గూగుల్ నిర్మించనున్న అతిపెద్ద కార్యాలయం ఇదే కావడం గమనార్హం. ఇప్పటికే ఈ కార్యాలయ నిర్మాణానికి గాను అవసరమైన అనుమతుల కోసం గూగుల్ ప్రయత్నం చేస్తున్నది. నానక్ రాం గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో గూగుల్ నిర్మించనున్న క్యాంపస్ లో 13 వేలమంది ఉద్యోగులు పనిచేయనున్నారు. మొత్తం 22 ఫ్లోర్లతో భవనాన్ని ఒకే బ్లాక్ గా నిర్మించనున్నారు. రూ. వెయ్యి కోట్లతో ఈ క్యాంపస్ ను నిర్మించనున్నారు. మూడు బేస్ మెంట్లు, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మొత్తం 22 అంతస్తులు ఉంటాయి. బేస్ మెంట్లను పార్కింగ్ కోసం వినియోగించనున్నారు. భవనానికి పూర్తిగా సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

ప్రస్తుతం కొండాపూర్ లో ఉన్న గూగుల్ క్యాంపస్ ఆ సంస్థది కాదు. దాన్ని లీజుకు తీసుకున్నారు. అందులో 7వేలమంది పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ నిర్మించనున్న ఈ కార్యాలయం ఆ సంస్థకు సొంత క్యాంపస్ కానుంది. కాగా భారత్ లో గూగుల్ కు 4 క్యాంపస్ లు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, గుర్గావ్ లలో గూగుల్ తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. హైదరాబాద్ తో పాటు క్యాంపస్ కు గానూ ఇప్పటికే పర్యావరణ శాఖ నుండి అనుమతులు అందాయి. గతేడాది అక్టోబర్ లోనే గూగుల్ ఆ అనుమతులు పొందింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం గూగుల్ తన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్యాంపస్ ను రెండున్నర ఏళ్లలో పూర్తి చేయనుంది. ఇదిలాఉండగా ప్రపంచంలోని టాప్ 5 కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, గూగుల్, యాపిల్ లు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

కేటీఆర్ చొరవ వల్లే..

హైదరాబాద్ లో గూగుల్ తన స్వంత కార్యాలయం నిర్మాణానికి 2015 లోనే అంకురార్పణ జరిగింది.అప్పట్లో రాష్ట్ర ఐటీ శాఖామంత్రిగా ఉన్న కేటీఆర్ అమెరికాకు వెళ్ళినప్పుడు గూగుల్ తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగానే నగరంలో గూగుల్ క్యాంపస్ ను నిర్మించేందుకు 7.2 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేటాయించిన ఆ స్థలంలోనే ఇప్పుడు గూగుల్ తన భారీ క్యాంపస్ ను నిర్మించనున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *