జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా లో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన ప్రతి జవాన్ కుటుంబానికి రూ. 25 లక్షలు అందజేయనున్నట్లు శాసనసభలో ముఖమంత్రి శ్రీ కేసీఆర్ ప్రకటించారు. ఈరోజు శాసనసభ సభ సమావేశాలు ప్రారంభం కాగానే పుల్వామా అమరజవాన్లకు సభ్యులందరూ సంతాపం ప్రకటించారు. అనంతరం అమరులకు సంతాపం ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఈనెల 14న పుల్వామలో జరిగిన ఉగ్రదాడి అత్యంత అమానుషమైనదన్నారు. సైనికుల మీద, వ్యక్తుల మీద జరిగిన దాడిగా కాకుండా సమస్త దేశంపై జరిగిన దాడిగా అందరూ భావిస్తున్నారని అన్నారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేయడమే కాదు. మీవెంట యావత్ జాతి ఉందన్న సందేశం ప్రస్ఫుటంగా పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన, రాష్ట్రం పక్షాన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలపడమే కాదు. వారి అమూల్యమైన ప్రాణాలను తిరిగి తేలేకపోయినా ఒక్కొక్క అమర జవాను కుటుంబానికి రూ. 25 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు.