mt_logo

తెలంగాణలో 3904.55 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న సాఫ్ట్‌వేర్ దిగ్గజం క్వాల్కమ్

సాఫ్ట్‌వేర్, వైర్‌లెస్ టెక్నాలజీ, సెమికండక్టర్ రంగాల్లో అంతర్జాతీయ దిగ్గజంగా పేరుపొందిన క్వాల్కమ్ సంస్థ ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అధికార బృందం శాండియాగోలోని క్వాల్కమ్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సంస్థ సిఎఫ్‌ఒ ఆకాష్ పాల్కివాల, ఉపాధ్యక్షులు జేమ్స్ జిన్, లక్ష్మి రాయపూడి, పరాగ్ అగాసే, డైరెక్టర్ దేవ్ సింగ్ బృందంతో సమావేశమైంది. హైదరాబాద్ నగరంలో వివిధ దశల్లో రూ.3904.55 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపిన క్వాల్కమ్, మంత్రి కేటీఆర్ తో తన పెట్టుబడి ప్రణాళికలను పంచుకుంది. నగరంలో అందుబాటులో ఉన్న నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రభుత్వ పాలసీలు తమ కంపెనీని నిరంతరం తెలంగాణలో విస్తరించేలా ప్రభావితం చేస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపింది. రానున్న ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ లో భారీగా పెట్టుబడి పెడతామన్న క్వాల్కమ్ సంస్థ, తమ విస్తరణతో 8700 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు సుమారు 15 లక్షల 72 వేల ఎస్‌ఎఫ్‌టి కార్యాలయం అందుబాటులోకి వస్తుందందని తెలిపింది. పెట్టుబడికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని, అక్టోబర్ నెల నాటికి హైదరాబాద్ లో తమ కేంద్రం రెడీ అవుతుందని క్వాల్కమ్ తెలిపింది.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…ఇప్పటికే టెక్ దిగ్గజాలు హైదరాబాదులో ప్రపంచంలోనే అతి పెద్ద రెండవ క్యాంపస్ అని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు. ఈ వరుసలో క్వాల్కమ్ సంస్థ చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇంత భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో సెమీకండక్టర్ చిప్ తయారీ వంటి రంగాల్లో తెలంగాణను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు క్వాల్కమ్ సంస్థ పెట్టుబడి ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు. సాఫ్ట్ వేర్ తో పాటు వ్యవసాయ, విద్యా రంగాల్లో తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడమే తమ విస్తరణ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని కంపెనీ ప్రతినిధులు మంత్రి కెటిఆర్‌కు వివరించారు. అగ్రిటెక్, విద్యారంగం, కనెక్టెడ్ డివైస్‌ల వినియోగం, స్మార్ట్ సిటీ కార్యక్రమాల్లో భాగం కావడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు మంత్రికి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *