తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజేస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల జరుగుతున్న ఇబ్బందులను వివరించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా, సుమారు 13 లక్షల మంది విద్యార్థుల జీవితాలను కాంగ్రెస్ ప్రభుత్వం అగమ్యగోచరంగా మార్చింది అని విమర్శించారు.
టీసీ, ఇతర సర్టిఫికెట్లు యాజమాన్యాలు ఇవ్వడం లేదు. దీని వల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీనివల్ల విద్యార్థులతో పాటు, తల్లిదండ్రులు, కాలేజి యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక, మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది అని మండిపడ్డారు.
విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 19 వేల కోట్లను ఫీజు రియంబర్స్మెంట్ కోసం విడుదల చేయడం జరిగింది. ప్రతి ఏడాది సగటున క్రమం తప్పకుండా రెండు వేల కోట్లు విడుదల చేసిందని, కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికి కేవలం విద్యార్థుల భవిష్యత్తును, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాము అని గుర్తు చేశారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లో ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్య పట్ల తమకున్న ప్రాధాన్యాన్ని చాటి చెబుతుంది..దసరా, దీపావళి వేళ సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేక పోతున్నామన్నారు. సిబ్బంది నుండి తమపై విపరీతమైన ఒత్తిడి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు అని పేర్కొన్నారు.
భవనాల అద్దెలు చెల్లించలేక, తెచ్చిన అప్పులు వడ్డీలు కట్టలేక, కొత్త అప్పులు దొరకక కళాశాలల నిర్వహణ భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని నిలదీస్తాం..ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని స్పష్టం చేశారు.
13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు.