ఇప్పటికే లుకలుకలు.. అంతర్గత విభేదాలు.. గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న టీబీజేపీకి నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రూపంలో కొత్త తలనొప్పి ఎదురైంది. పసుపు బోర్డు పేరుతో రైతులను రెచ్చగొట్టి నిజామాబాద్ ఎంపీగా ఎలాగో అలా గెలిచేసిన అర్వింద్.. ఆ తర్వాత రైతులకు కుచ్చుటోపీ పెట్టారు. పసుపుబోర్డుతో సంబంధం లేని స్పైసెస్ బోర్డును తీసుకొచ్చి చేతులు దులుపుకొన్నారు. దీంతో ఎక్కడికెళ్లినా ఆయనను రైతులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. బీజేపీ అంటేనే మండిపడుతున్నారు. తాజాగా, సొంత పార్టీ నాయకులే అర్వింద్ దురహంకారం.. దురుసు ప్రవర్తన, ఆధిపత్య ధోరణిని నిరసిస్తూ రోడ్డెక్కారు. ఎంపీ అర్వింద్ నిజామాబాద్ బీజేపీలో ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్నారంటూ తిరగబడ్డారు.
బీజేపీ ఆఫీసుల్లోనే కమలదళం నిరసనలు..
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఇటీవల జిల్లాలోని 13 మండలాల పార్టీ అధ్యక్షులను ఇష్టానుసారం మార్చేశారు. ఈ విషయంలో ఆయన ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై జిల్లాలోని కమలం నేతలు భగ్గుమన్నారు. ఏకంగా హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో అర్వింద్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. తాజాగా, జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో బైఠాయించారు.నిజామాబాద్‌లో బీజేపీ కనుమరుగైపోతున్నదని ధ్వజమెత్తారు. *సేవ్ బీజేపీ* అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అర్వింద్‌పై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానానికి డిమాండ్ చేశారు. లేకుంటే నిజామాబాద్‌లో బీజేపీ ఇక మిగలదని హెచ్చరించారు. ఓ వైపు రైతులు.. మరోవైపు సొంత పార్టీ నాయకులు తనకు వ్యతిరేకంగా ధర్నాకు దిగడంతో ఎంపీ అర్వింద్ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ఏంచేయాలో తెలియక టీబీజేపీ తలపట్టుకొంటున్నది.