mt_logo

మాట తప్పను

-తలతెగిపడ్డా నూటికి నూరు శాతం హామీలు నెరవేరుస్తా: కేసీఆర్
– తల తెగిపడ్డా ఇచ్చిన మాట తప్పను
– దసరా నుంచి పథకాలు అమలు
– వంద రోజుల్లో ఏమీ చేయలేదని పొన్నాల అన్నడు
– కరెక్టే.. వాళ్లయితే రూ. కోట్లు మింగే వాళ్లు
– 5లక్షల ఓట్ల మెజార్టీతో కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపించండి
– నర్సాపూర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్
మెదక్ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్‌ఎస్ దూసుకుపోతున్నది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కేంద్రీకరించి పని చేస్తుండగా.. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సభతో కొత్త జోష్ సంతరించుకుంది. నర్సాపూర్‌లో జరిగిన భారీ బహిరంగసభనుద్దేశించి ప్రసంగించిన కేసీఆర్.. ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యలే ఇతివృత్తంగా కచ్చితంగా బంగారు తెలంగాణ సాధించే దిశగానే ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ప్రజలకు ఏవైతే చెప్పినమో ఇప్పటికే కొన్ని పనులు చేసినం. అవన్నీ ప్రజలకు దసరా పండుగనుంచి అమలు జరుగతయి. నేను ఏదైనా చెప్పిన అంటే నా తలకాయ తెగిపడ్డా సరేగాని ఆ మాట నుంచి వెనుకకు పోయే ప్రసక్తే ఉండదు. చెయ్యగలిగిందే చెప్తా.

చెప్పింది ఆరు నూరైనా హరిహరబ్రహ్మాదులు అడ్డమొచ్చినా అమలుచేసి చూపిస్తా అని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి, బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డిలిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని రూపాయి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్ల చెల్లుతది? అని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఓటు ఎందుకు వేయాలే? తెలంగాణ అయిన తెల్లారి మన ఏడు మండలాలు గుంజుకున్నందుకా? తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డికి టిక్కెట్ ఇచ్చి సిగ్గు తీసుకున్నందుకా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తారని తనకు తెలుసునని, అయితే ఐదు లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఆయనను గెలిపించాలని కేసీఆర్ మెదక్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తల తెగిపడ్డా సరే.. ఇచ్చిన ప్రతి హామీ నూటికి నూరుశాతం అమలు చేసి చూపిస్తా అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఆరు నూరైనా హరిహర బ్రహ్మాదులు అడ్డమొచ్చినా చేసిన ప్రతి వాగ్దానం అమలుచేస్తానన్నారు. చరిత్రలో కనివినీ ఎరగని పాలన అందిస్తా. మాటలు కాదు.. ఆచరణలో చూసిస్తా అన్నారు.

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బుధవారం నిర్వహించిన మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రచార సభలో సీఎం ఉద్వేగభరితంగా ప్రసంగించారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడినందున మన పరిస్థితి ఏమిటి? ఏం చేయాలె? ఎట్ల చేయాలె అనే అధ్యయనంలో ఉన్నం. అసలు పాలన బడ్జెట్ తర్వాత మొదలు పెడ్తం అని సీఎం చెప్పారు. ఈ దసరా పండుగ తెల్లవారినుంచి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు అందుతాయని, దళిత, గిరిజన ఆడబిడ్డల పెండ్లిళ్లకు సర్కారు ప్రకటించిన రూ.51వేల కట్నం అందిస్తామని చెప్పారు. ప్రభుత్వం వంద రోజుల్లో ఏమీ చేయలేదని కాంగ్రెస్‌వారు విమర్శలు చేస్తున్నారని అంటూ అవును.. వాళ్లయితే ఈ పాటికి మూడు, నాలుగు కోట్లయినా మింగేసి ఉండేవాళ్లు అని దెప్పిపొడిచారు. కాంగ్రెస్, బీజేపీలకు ఎందుకు ఓట్లు వేయాలనిప్రశ్నించారు. ఆ పార్టీల అభ్యర్థులు గత అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని రూపాయలని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా చెల్లుతాయని ప్రశ్నించారు.

ఇండ్ల దొంగలను బయట పెడతాం
బలహీనవర్గాల ప్రజలు గౌరవంతో బతకాలని రెండు బెడ్‌రూంలు, ఒక హాలు, ఒక కిచెన్ ఇండ్లు నిర్మిస్తమని హామీ ఇచ్చినం. ఈ పథకానికి కాంగ్రెసోళ్లే అడ్డం అని కేసీఆర్ చెప్పారు. గతంలో ఒక్కో కాంగ్రెస్ నాయకుడు రెండేసి బిల్లులు లేపుకున్నరు. నేనంటున్నది నిజమేనా? నిజమనేటోళ్లు చెయ్యెత్తండి అని కేసీఆర్ అనడంతో సభకు హాజరైన వారంతా చెయ్యెత్తారు. ఇప్పుడు టీఆర్‌ఎస్ రూ.3.30లక్షలతో నాలుగు రూంల ఇండ్లు కడతది. పది ఇండ్ల బిల్లు మింగితే రూ.33లక్షలు పోతయి. వంద ఇండ్ల బిల్లులు దొంగతనం చేస్తే మూడుకోట్లకు పైగా పోతయి. ఇప్పుడు దొంగలంతా నోళ్లు తెరుచుకుని కాచుకుని కూర్చున్నరు. ఎవడెవడు దొంగతనం జేసిండో దొరకబట్టి, సంగతి చూడమని సీఐడీకి ఆదేశించిన. ఇప్పుడు కట్టే ఇంటి నిర్మాణంలో ఒక్కరూపాయి వేస్ట్ పోవద్దు. దొంగల భరతం పట్టాలే. అప్పుడే ఇండ్లపథకం మొదలు పెడతమని చెబుతున్న. రాబోయే కొద్ది రోజుల్లోనే ఇండ్ల నిర్మాణం మొదలు పెడుతం. మండల, మున్సిపాలిటీ కేంద్రాల్లో పేదలకు మంచి కాలనీల నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చినం అన్నారు.

సర్వేకు భయమెందుకు?
ప్రజలు ఎంత మంది ఉన్నరు? ఎవరికి ఎంత భూమి ఉంది? భూమి లేనోళ్లు ఎవరు? అనే లెక్కకోసం సర్వే అడిగినం. దానికి ప్రతిపక్షాలు ఆగమైనయి.. గగ్గోలు పెట్టినయి. సర్వే చేస్తే వాళ్లకేం భయం నాకర్ధం కాదు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వాళ్లు ఆందరూ మాట్లాడిండ్రు. కానీ ప్రజలు మాత్రం దసరా, బతుకమ్మ పండుగలకు వచ్చినట్టు ఊర్లకు వచ్చి సర్వేలో పాల్గొన్నరు. మీ అందరికీ సాల్యూట్ చేస్తున్న అన్నారు. సర్వేలో పాల్గొన్న పద్ధతిలోనే వేరే ప్రాంతంలో ఉన్నా వచ్చి మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్‌లో ఓటర్లంతా పాల్గోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మీ బిడ్డగా, మెదక్ మట్టి బిడ్డగా ప్రమాణం చేసి చెబుతున్నా. చరిత్రలో గత ప్రభుత్వాలు ఎప్పుడూ కనీవినీ ఎరగని ప్రభుత్వ పాలన అందిస్తా. మాటలు కాదు, ఆచరణలో చేసి చూపిస్తా అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

సిద్దిపేట తరహాలో అన్ని గ్రామాలకు నీళ్లు..
నాలుగేండ్లలో సిద్దిపేట తరహాలో లోయర్ మానేరు నుంచి ప్రతిరోజు నీళ్లు వస్తున్నట్టే తెలంగాణ పది జిల్లాలకు మంచినీరు అందిస్తామని సీఎం చెప్పారు. ప్రతి ఇంటిలో నల్లా, స్వచ్ఛమైన నీరు అందించే బాధ్యత తనదేనని అన్నారు. విద్యుత్ సమస్యను తాను ఎప్పుడూ దాచిపెట్టలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. మూడేళ్ల తర్వాత రెప్పపాటు సమయం కూడా కోత లేకుండా కరెంటు ఇస్తామని చెప్పారు. ఇవాళ ఏం చేశామని బీజేపీ ఓటు వేయమని అడుగుతున్నదని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన మరుసటి రోజే ఏడు మండలాలు గుంజుకున్నారని, కరెంటు ఆంధ్రాకు ఇచ్చేశారని ఆయన దుయ్యబట్టారు. చివరికి తెలంగాణ ద్రోహి అయిన జగ్గారెడ్డికి టిక్కెట్ ఇచ్చి సిగ్గు తీసుకున్నదని అన్నారు. మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ తెలంగానోడు జగ్గారెడ్డికి ఓటు వేయడని స్పష్టం చేశారు.

గత ఎన్నికల్లో తనకు 3.97 లక్షల మెజార్టీ ఇచ్చి గెలిపించారని, ఈసారి ప్రభాకర్‌రెడ్డిని 4లక్షలు దాటి 5లక్షల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తక్కువ మెజార్టీ వస్తే నవ్వేటోని ముందట జారి పడ్డట్లైతదని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ పని అయిపోయిందని దుష్ప్రచారం చేస్తారని వ్యాఖ్యానించారు. ఈ సభలో పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, డిప్యూటీ సీఎంలు రాజయ్య, మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, మహేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు నాగేష్, బాల్క సుమన్, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు బాబుమోహన్, మదన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి, తెలంగాణ పది జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

భయంకరమైన దాడి చేసిండ్రు..
2001లో తెలంగాణ సాధిస్తానని బయలుదేరిన. ఆరోజు చాలామంది ఈయనెక్కడ బక్కగా ముత్తెమంత ఉన్నడు, ఊత్తే కొట్టుకుపోతడన్నరు. ఈయనెక్కడు తెలంగాణ తెస్తడని మాట్లాడిండ్రు. అయ్యేపనా, పోయ్యేపనా, ఇదేం దుకాణం? అన్నరు. ఉద్యమం ముందుకు పోతాఉంటే మొదట కేసీఆర్‌ను గుర్తించడానికి నిరాకరించిండ్రు. గుర్తించిన తరువాత దాడి మొదలుపెట్టిండ్రు. భయంకరమైన దాడిచేసిండ్రు. మానసికంగా నన్ను గాయపరచాలని, అధైర్యపరచాలని చెయ్యని ప్రయత్నం లేదు. ఏ రోజుకూడా మడమ తిప్పకుండా మీ ఆశీస్సులు, దీవెనతోని ముందుకే సాగిపోయినం. నికార్సయిన తెలంగాణ సాధించి తీరినం అని కేసీఆర్ చెప్పారు. ఈ ఉపఎన్నిక ప్రచారంలో మాట్లాడే వాళ్లను చూస్తుంటే కొంత బాధ, కొంత సిగ్గనిపిస్తది. ప్రభుత్వంపై ఆరోపణలు చేసే వాళ్లకు అసలు నెత్తి పనిచేస్తుందా? అర్థం కాని పరిస్థితి అన్నారు. మూడు నెలల్లో ఏం కాలేదని పొన్నాల మాట్లాడుతున్నడు.

పొన్నాల లక్ష్మయ్యా.. నిజంగనే కాలే. అదే మీ కాంగ్రెస్ అయితే మూడు నాలుగు కోట్లు మింగుదురు. మీరు చేసిన గా పని మేంచేయలేదు. మాకు చాతకాదు కూడా. ఆ పనికాలేదు కాబట్టి నీకు ఏం కానట్టే కనబడుతున్నది అని ధ్వజమెత్తారు. గత్తరయిపోయి, బిత్తరయిపోయి, ఆగమైపోం. కొత్త రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డం. ఏపీనుంచి వచ్చిన దరిద్రం చాలాఉన్నది. దాన్నంత మార్చుకోవాలి. కొత్త చట్టాలు రూపొందించుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నం? ఎక్కడికి చేరుకోవాలె? దానికేం ప్రణాళిక కావాలె? బడ్జెట్ ఎంత కావాలె? ఉన్న వనరులేంటి? లేనివేంటి? దేన్ని ఎట్ల తెచ్చుకోవలె? కేంద్రం నుంచి ఏం తేవాలె? ఇక్కడ మనమేం చేయాలె?.. ఇగో ఈ పనిలో నేను నిమగ్నమై ఉన్నా అని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని పనులు చేసినం. అవన్నీ ప్రజలకు దసరా పండగ నుంచి అమలు జరుగుతయి అని వెల్లడించారు.

రైతు రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తం..
పొన్నాల లక్ష్మయ్యా! ఒక మాట అడుగుతా. మీ జిందగీల ఎప్పుడైనా పేదల గురించి ఆలోచించారా? రైతులకు అప్పు మాఫీ చేయాలనే సోయి మీ 40 ఏళ్ల రాజ్యంలో ఎప్పుడైనా ఆలోచన చేసిండ్రా? రైతులకు మీ జీవితంలో ఒక్క రూపాయి మాఫీ చేసిండ్రా? ఆ సోయి ఉన్నదా? అని నిలదీశారు.

ఆరునూరైనా సరే బంగారం మీద తెచ్చిన వాటితో సహా లక్షలోపు పంటరుణాల మాఫీకి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. దాన్ని అమలు చేసి తీరుతం అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపై కాగితాలు తెచ్చి పంచిపెడుతున్నరు కొందరు సన్నాసులు. కాంగ్రెస్ నాయకులారా? మేం రుణాలు మాఫీ చేయమని చెప్పినమా? ఈకకు తోకా, తోకకు ఈక తీసి, కోడిగుడ్డు మీద ఎంటికలు పీకి లేని కథలు పుట్టిస్తుండ్రు అని కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రుణాల మాఫీ కావాలంటే ప్రభుత్వం మూడో, నాలుగో కిస్తీలలో మాఫీ చేస్తమని బ్యాంకులతో మాట్లాడుకుంటరు.

గతంలో ఎవరు చేసినా అదే పనిచేసిండ్రు. ఇక్కడి బ్యాంకులకు రిజర్వు బ్యాంకు పర్మిషన్ ఇవ్వాలె. రిజర్వు బ్యాంకు వాళ్లు పర్మిషన్ ఇస్తలేరు. ఇయ్యనప్పటికీ మనకు వేరే మార్గాలున్నయి. ఆ మార్గాల ద్వారా రుణమాఫీ చేస్తం. ఒకటికి మూడుసార్లు ఆర్థిక శాఖ కార్యదర్శి, చీఫ్ సెక్రటరీలను రిజర్వు బ్యాంక్ గవర్నర్ దగ్గరికి బొంబాయికి పంపించినం. రిజర్వు బ్యాంకు మూడు జిల్లాలకు పర్మిషన్ ఇచ్చింది. కడమ జిల్లాలకు ఇంకా ఇయ్యలే. మళ్లీ బొంబాయి పోయి చెప్పివచ్చినం. ఇదంతా ప్రక్రియ జరుగుతున్నది అని కేసీఆర్ వివరించారు. పని పూర్తయిన చోట మాఫీ చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటమని చెప్పారు. రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని ఇప్పటికే బ్యాంకు వాళ్లతో చెప్పినం. వారు కూడా సరే అన్నరు. కొద్ది రోజుల్లోనే రైతులందరికీ రుణాలు ఇస్తరు అని కేసీఆర్ ప్రకటించారు.

గులాబీవనమైన నర్సాపూర్
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ సక్సెస్ అయ్యింది. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షల మంది సభకు తరలివచ్చారు. సభ సాయంత్రం 4గంటలకు మొదలు కాగా మధ్యాహ్నం 1గంట నుంచే వేలమంది జనం తరలివచ్చారు. సంగారెడ్డి-నర్సాపూర్, తూప్రాన్-నర్సాపూర్ రహదారిలో ట్రాఫిక్ స్తంభించడంతో వేలమంది ప్రజలు సభకు చేరుకోకుండానే వెనుదిరిగారు. ఉప ఎన్నికల బాద్యత నిర్వహిస్తున్న మంత్రి హరీశ్‌రావు సభ విజయవంతానికి ప్రత్యేకంగా కృషి చేశారు. సీఎం కేసీఆర్ సభతో నర్సాపూర్ పూర్తిగా గులాబీ వనంగా మారింది.

నర్సాపూర్-పటాన్‌చెరు, సంగారెడ్డి-నర్సాపూర్, మెదక్-నర్సాపూర్, తూప్రాన్-నర్సాపూర్ రోడ్లన్నీ సభకు తరలివచ్చిన ప్రజల వాహనాలతో కిటకిటలాడాయి. సభ పూర్తయిన తరువాత నర్సాపూర్ నుంచి బయటకు వెళ్లడానికి గంటకుపైగా సమయం పట్టింది. ఇదిలా ఉండగా సభ సక్సెస్‌తో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం కనిపించింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో దొంగలను పట్టుకోవాల్సిందేనని అని కేసీఆర్ పిలుపునివ్వడంతో అందరూ చేతులెత్తి హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాటకు మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే బాబుమోహన్ డ్యాన్సు చేశారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *