mt_logo

బూట్లతో తొక్కి, గొంతు నొక్కి…

-మాడభూషి శ్రీధర్

నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు,
(చలో అసెంబ్లీ అణచివేతపై జూన్ 29న ప్రజాకోర్టు జడ్జిగా వ్యవహరించారు)

“వెనుక నుంచి ఒక చేయి గొంతు పట్టుకున్నది. మాట్లాడే అవకాశం లేదు. మరో రెండు చేతులు నా కాళ్లు లేపినై. వెనుకనుంచి నన్ను ఎవరో ఎత్తివేసినారు. రెక్కలు వెనకకు విరిచి కట్టారు. కొన్ని చేతులు నా కడుపులో చేతులు పెట్టి పిండేస్తున్నారు. నాకు ఏం జరిగిందో అర్థం కాకముందే నేను చేతుల మీద గాలిలో ఉన్నాను. గొంతు నులుముతున్నారు. ఊపిరి ఆడడం లేదు. చంపేస్తారా? ఇది ఎవరు చేస్తున్నారు? వారెవరో.. ఖాకీ బట్టల్లో లేరు. వారు పోలీసులా? కాదా? తరువాత చూస్తే వాళ్లు పొలీసు అధికారులని, మఫ్టీలో ఉన్నారని అర్థమైంది. చుట్టూ ఉన్న నా సహచరులను కొడుతున్నారు. కొందరిని నేలమీద పడేసి తొక్కుతున్నారు. ఒక మిత్రుడిని రెక్కలు విరిచేసినంత పని చేసారు. ఇంకా చెప్పుకునేందుకు వీలులేని విధంగా కొట్టారు…” ఇది చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న ఓ తెలంగాణ కార్యకర్త చెప్పిన కథ కాదు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం స్వయంగా అనుభవించిన వేదన. చలో అసెంబ్లీ పిలుపు ఇచ్చిన నాయకుడిగా ఆయన ప్రజాకోర్టు ముందు తనను పోలీసులు ఏ విధంగా వేధించారో వివరించారు. వయసులో పెద్దవాడినని కూడా పరిగణించకుండా గొంతునొక్కడం కింద పడేయడం, ఎత్తిపడేయడం జరిగిందని ఆవేదన చెందారు. ఒక్కడిని పది పదిహేను మంది మఫ్టీ పోలీసులు కింద పడేసి తొక్కడం తానుచూసానని, ఏ ఉద్యమంలోనూ ఇటు వంటి నీచమైన పనులను రక్షకభటులని పిలువబడే వారెవరూ చేసి ఉండరని కోదండరాం వివరించారు.

మొత్తం జేఏసీ నేతల ఫోన్లన్నీ వరసగా టాప్ చేస్తూనే ఉన్నారు. తమ లొకేషన్ తెలుసుకోవడం, మాటలు విని వెంటనే కొన్ని చోట్లకు వెళ్లి సోదాలు అరెస్టులు చేయడం సాగించారు. ఇదివరకు అసెంబ్లీ ముందు నిలబడి నినాదాలుచేసే స్వేచ్ఛ ఉండేది. దాన్ని టాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం దాకా పరిమితం చేశారు. ఆ తరువాత కనీసం ఇందిరా పార్కు దగ్గర ఎవ్వరి అనుమతీ లేకుండా సమస్యలు చెప్పుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఎక్కడా ఎవరూ నిరసన చెప్పే హక్కులేదని కోదండరాం బాధ పడ్డారు. విద్యాలయాల్లో ప్రవేశించకూడదని పోలీసులపైన కోర్టునుంచి ఉత్తర్వులు తెస్తే సుప్రీంకోర్టు దాకా పోరాడాలి. ప్రహరీ గోడమీదినుంచి విద్యార్థుల మీద కాల్పులు జరుపుతారు. బాష్పవాయుగోళాలు పేల్చి గుంపును చెదరగొట్టడం, తరువాత మీద బడి కొట్టడం, చుట్టుముట్టడం, కింద పడేసి ప్లాస్టిక్ లాఠీలు విరిగేట్లు కొట్టడం, చెదిరిపోయి సందుల్లో దూరిన వారిని అడ్డుకుని కొట్టి అరెస్టు చేయడం.. జనం మీద ఇంత దౌర్జన్యమా? కాలం తీరిన బాష్పవాయుగోళాలు ప్రయోగిస్తారు. బాష్పవాయుగోళం తగిలి మూర్ఛపోయిన ఉస్మానియా విద్యార్థి కృష్ణా నాయక్ నాలుగురోజుల దాకా స్పృహలోకి రాలేదు. 12రోజులు ఆస్పత్రిలో ఉండి అక్కడినుంచి నేరుగా ప్రజాకోర్టుకు వచ్చాడు.

ప్రజాకోర్టు ముందుకు అంతకు ముందు వెల్లడికాని అనేక అంశాలు, వెల్లడైనా అంతగా మీడియా ముఖం మీదకు రాకుండా లోపలి పేజీల్లో ‘సింగిల్ కాలం’ నాలుగు వాక్యాలకు పరిమితమైన అంశాలు వెల్లడడైనాయి. ప్రజాఉద్యమం మీద పోలీసులను అణచివేతకు వాడుకున్న వివరాలు ప్రజాకోర్టులో ప్రతిధ్వనించాయి. ఉద్యమాన్ని అణచి వేయడానికి 30వేల మంది పోలీసులను నియమించారు. కాని కావాలని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి పోలీసులను దించడం, తెలంగాణ పోలీసులను కేవలం పై అధికారుల ఆదేశాలను అమలు చేయడానికి మాత్రమే నియుక్తులను చేయడం, తెలంగాణ వ్యతిరేక కుట్రకు సాక్ష్యం. శ్రీకాకుళం నుంచి వచ్చిన మహిళా పోలీసు అధికారిణి డీఎస్పీ రమాదేవి అమానుషంగా వ్యవహరించారు. ఆమె అధ్వర్యంలో మహబూబాబాద్‌లో మూడురోజుల ముందునుంచే అరెస్టులు చేశారు. తెలంగాణ అంటారా అంటూ విరుచుకుపడ్డారు. మేం నక్సలైట్లం కాదని చెప్పుకుంటే మీరు నక్సలైట్లయితే కాల్చేస్తాంరా అన్నారు. 230 మందిని బంధించారు. మహబూబాబాద్, కేసముద్రంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ముందు రోజూ హాజరుకావాలని బైండోవర్ చేశారు. ‘రోజంతా దానికే సరిపోతుంది’ అని ఆర్ సత్యనారాయణ అనే లెక్చరర్ (మహబూబాబాద్ వరంగల్ జిల్లా) ప్రజాకోర్టుకు చెప్పారు. తెలంగాణ అని పేరెత్తిన వ్యక్తి భార్యా పిల్లలను రోడ్డు మీద నిలబెట్టారు.

రిటైరైన ఉద్యోగి ఉప్పు సుధాకర్ తనను ‘సీమాంధ్ర పోలీసులు అశోక్‌నగర్ దగ్గర ఎంతో కిరాతకంగా కొట్టార’ని వివరించారు. ‘మెడ బట్టి నొక్కినారు. ఊపిరి ఆడలేదు. చచ్చిపోతానేమోననుకున్నాను. నా మిత్రులు ఆ చేతిని బలవంతంగా తొలగించారు. నాకు ఆరోజు 68దెబ్బలు తగిలాయి’ అని సుధాకర్ వివరించాడు. వికారాబాద్ నుంచి వచ్చిన వందమంది గాంధీనగర్ నాలా దాకా చేరుకున్నారు. అక్కడికి వందలాదిమంది పోలీసులు చేరుకుని ‘తెలంగాణా లం… కొడుకుల్లారా చెప్పుతో కొడతాంరా పండ్లు ఊడబీకుతాం రా’ అంటూ విరుచుకు పడ్డారు. ప్లాస్టిక్ లాఠీలు విరిగే దాకా కొట్టారు. ఒక్కడిమీద నలుగురు అయిదుగురు చుట్టుముట్టి కొట్టారని వికారాబాద్ నుంచి వచ్చిన బోడ జంగయ్య ప్రజాకోర్టుకు వివరించాడు. వారం దాటిన తరువాత కూడా జంగయ్య వంటిపై వాతలు కనిపిస్తున్నాయి. ‘ఇప్పడికీ కూచోలేకపోతున్నాను. 12 మంది కలిసి కొట్టారు, రెండు లాఠీలు నా మీద విరగ్గొట్టారు’ అని జంగయ్య చెప్పారు.

‘ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలిస్తావా’ అంటూ తనను ‘వికలాంగుడని కూడా చూడకుండా పోలీసులు బూతులు తిడుతూ కొట్టార’ని సంగారెడ్డి నుంచి వచ్చిన సత్తయ్య వివరించారు. ‘స్కూలు టీచర్ వై ఉండి, జై తెలంగాణ అంటవా నీకేం పోయే కాలం అని తనను తిట్టి అరెస్టు చేసార’ని జూన్ 4వ తేదీ నుంచే తమ మీద దౌర్జన్యం చేశారని శుభప్రద పటేల్ చెప్పాడు. మహిళలు, విద్యార్థులు, వయోవృధ్దులు అనే విచక్షణ లేకుండా కొట్టారు. ‘జై తెలంగాణ అంటావా నిన్ను పెళ్లికి పనికి రాకుండా చేస్తారా’ అంటూ కావాలని మర్మాంగాల మీద బూటు కాళ్లతో తన్నారు.

వీరి లక్ష్యం చలో అసెంబ్లీని నిరోధించడం కాదు, తెలంగాణ ఉద్యమకారులపైన బహిరంగంగా ధర్డ్ డిగ్రీ హింస ప్రయోగించడం. వరంగల్ యాకూబ్ రెడ్డిని పోలీసుస్టేషన్లు తిప్పుతూ కొట్టి వెన్నుపూస దెబ్బతీసిన రీతిలో వందలాది మందిని తిప్పుతూ కొట్టారు. ‘నన్ను ప్రతిరోజూ కొడుతున్నారు. నా నడుము మీద ఎక్కి పోలీసులు నిలబడ్డారు. వెన్నుపూస బొక్కలు విరిచారు. పదినిముషాల కన్నా ఎక్కువ నిలబడలేన’ని యాకూబ్ రెడ్డి వివరించాడు.

‘ఎక్కడెక్కడ పట్టుకున్నారో చెప్పలేని స్థితి మాది’ అని వరంగల్ నుంచి వచ్చిన కమీరున్నీసా బేగం, రహీమున్నీసా బేగం ప్రజాకోర్టులో పోలీసులు తమను హింసించిన రీతి వివరించారు. రహీమున్నీసా బేగం మీద దాదాపు 150 కేసులు పెట్టారు. నోటికి వచ్చినట్టు తిట్టడం, బూతులు మాట్లాడడం, శారీరకంగా దౌర్జన్యం చేయడం, జై తెలంగాణ అన్నందుకు చావబాదడం మాకు ఎదురైందని రహీమున్నిసా బేగం చెప్పుకున్నారు. తనపైన 30మంది పోలీసులు దాడి చేశారనీ, ఒక్క ఆడ పోలీసు కూడా లేదని కొట్టరాని చోట కొట్టి, పట్టరాని చోట పట్టి, చెప్పరాని విధంగా కిందపడేసి తొక్కినారని ఆమె వివరించారు.

ఇవన్నీ ఇటీవల సవరించిన క్రిమినల్ లా నిర్భయ చట్టం ప్రకారం లైంగిక నేరాలు. కానీ చేసిన పోలీసులు ఎవరో తెలియదు, వారి పైన ఏ పోలీసులకు ఫిర్యాదుచేయాలో తెలియదు. ఏ పోలీసులు ఏ విధంగా దర్యాప్తుచేయగలరో వారిని చేయనిస్తారో తెలియదని ఆమె వాపోయారు.

‘బడులు తెరుస్తారు కనుక నేను చలో అసెంబ్లీలో పాల్గొనడం లేద’ని మంచిర్యాల గురిజాల రవీందర్‌రావు రాసిచ్చినా తనకు బెదిరింపులు, నిఘా, చుట్టూ పోలీసులు ఉండడం, మూడురోజుల ముందునుంచే పోలీసు స్టేషన్‌కు హాజరు కావాలనడం, స్కూలు బస్సును తెలంగాణ వారికి ఇవ్వకూడదని బెదిరించారు. డ్రైవర్ భార్యను కొడుకును అరెస్టు చేశారు. ఈ విధంగా హింసించే అధికారం పోలీసులకు ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వనేతలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. ఇది సాధారణ న్యాయస్థానంలో వాదించలేని నేరం. మానవహక్కుల ఉల్లంఘన.

సిరిసిల్ల నుంచి వచ్చిన సుమలతా శర్మ (టీఆర్‌ఎస్ కార్యకర్త) బేగంపేటలో ఉంటున్నారు. జూన్ 12న ఉదయం 11 నుంచి 2 వరకు ఆమె ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పదినిముషాల్లో పంపుతామని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. తరువాత మూడురోజులు ఇక్కడే ఉంచుతాం అన్నారు. అక్కడ వాతావరణం అసహ్యంగా ఉంది. రాత్రి పదిన్నర దాకా అక్కడే ఉంచి, అసెంబ్లీ దరిదాపుల్లో కనిపించరాదని బెదిరించి పంపారు. మళ్లీ తెల్లారగానే 5గంటలకు స్టేషన్ రావాలని వత్తిడి మొదలు పెట్టారు. బోయినపల్లి పోలీసు స్టేషన్, తరువాత మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.14 సా యంత్రం 7.30గంటలకు విడుదల చేశారు. తిండి లేదు, ఇతర కనీస వసతులు లేవు. దుర్భాషలు, అవమానకరంగా వ్యవహరించడం వారికి మామూలై పోయిందని సుమలతాశర్మ వివరించారు.

తమను పూజలు, వంటలు చేసుకోనివ్వలేదని సుమలత వివరిస్తే, ఉస్మానియా నుంచి, అసెంబ్లీ దారిలో అనేక చోట్ల వేలాదిమందిని శుక్రవారం నమాజు చేసుకోనివ్వలేదని హమీద్ మహ్మద్‌ఖాన్ వివరించారు. రాజకీయ ఉద్యమాలను ఎదుర్కొనడానికి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించడం, శాంతి భద్రతలు కాపాడడం లేదా ప్రభుత్వ ఆదేశాలను పాటించడం పేరిట రాక్షసంగా వ్యవహరించడం ఏ చట్టం ఆమోదిస్తుంది? తెలంగాణ ఉద్యమంలో 1969లో వందలాది మందిని చంపడం కన్న, వేయిమంది ఆత్మహత్యలకు పరోక్షంగా కారణం కావడం కన్న, మిలీనియం మార్చ్, తదితర కార్యక్రమాలను ఎదుర్కోవడానికి పన్నిన వ్యూహా ల కన్న, చలో అసెంబ్లీ సందర్భంలో అనుసరించిన పద్దతులు దారుణంగా ఉన్నాయి. రాజ్యాంగానికి, చట్టాలకు, హక్కులకు, ప్రజాస్వామ్యానికే కాకుండా కనీస మానవ విలువలకు కూడా భంగకరంగా వ్యవహరించారని అర్థమవుతున్నది. బూట్లు, బూతులు, లాఠీలు నిర్బంధాలు, నిరసన గొంతుమీద కాంగ్రెస్ ఆదేశాలతో గొంతు నొక్కే పోలీసు చేతులు చేసింది.. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ జనం మీద జరిగిన దాడి. విద్వేషం, విధ్వంసం హింసను ప్రయోగించి పోలీసుల్లో తెలంగాణ వ్యతిరేక ద్వేషాన్ని పెంచి పోషించి ప్రభుత్వం ఏ రకంగా విజయం సాధించినట్టు?

బాంబే నూలుమిల్లులో సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసులు కాల్పులు జరిపినపుడు కార్మికులు చనిపోయిన సంఘటనను విచారించిన త్రిసభ్య సంఘం నివేదికను బాంబే లెజిస్లేటివ్ అసెంబ్లీలో మార్చ్ 1939లో చర్చించినపుడు డాక్టర్ అంబేడ్కర్ అన్న విషయాలు గమనిద్దాం. ‘చట్టం దృష్టిలో సాధారణ పౌరుడు, పోలీసుఅధికారి, మిలిటరీఅధికారి సమానమే. రాజ్యాంగ పాలనా శాస్త్ర నిపుణుడు ఎ.డి.డైసీ పోలీసు మిలిటరీ అధికారుల పరిమితుల గురించి వ్యాఖ్యానిస్తూ .. వీరు పై అధికారులు కాల్చమని ఉత్తర్వలు ఇచ్చినపుడు వాటిని పాటించకపోతే కోర్టు మార్షల్‌ను ఎదుర్కొనాలి. కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు తీస్తే న్యాయస్థానంలో నిందితులుగా నిలబడాల్సి వస్తుంది. నూలు మిల్లు దగ్గర సమ్మెచేస్తున్న కార్మికులపై కాల్పులు జరిపిన పోలీసు అధికారికి ఇతర పోలీసులకు 200 రూపాయలు ఇచ్చినట్టు ఖచ్చితమైన సమాచారం నా దగ్గర ఉంది. కాల్పులు జరగడానికి కారణం శ్రామికుల అనుచిత ప్రవర్తన కాదు, మిల్లు యాజమాన్యం ప్రోత్సాహమే. అలజడిని అరిక కు రాజ్యానికి స్వేచ్ఛ స్వాతంవూత్యాల పట్ల గౌరవం ఉండనక్కర లేదా, మనం కోరుతున్న స్వయంపాలన అంటే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో నిమిత్తం లేకుండా మన మంత్రులే మన ప్రజలను చంపే పాలనైతే అంతకన్నా దారుణమైన విషాదం మరొకటి ఉండదు. పొగలోంచి సెగలోకి పోయినట్టు అటువంటి స్వయం పాలన మన పాలిటి శాపంగా మారుతుందనడంలో నాకే సందేహం లేదు.

మనం స్వేచ్చా స్వాతంత్ర్యాలకు చట్టబద్ద పాలనకు విలువనివ్వాలి’. 1939 నాటి ఈ అంబేడ్కర్ మాటలు 2013లో మన సర్కారుకు కూడా వర్తిస్తాయని వేరే చెప్పనక్కర లేదుపై అధికారులు అరెస్టు చేయమన్నారు కనుక చేస్తున్నాం అని ప్రతి పోలీసుఅధికారి చలో అసెంబ్లీ సందర్భంలో అన్నాడు. అది నిజం కూడా. ఈ పై అధికారి ఎవరు? డీజీపీయా లేక వారిపైన ఉన్న మంత్రా, ముఖ్యమంత్రా లేదా వారిపైన ఉన్న మరో శక్తా? తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో సాగిన హింసాకాండ అధికార పార్టీని, ప్రభుత్వాన్ని సిగ్గుతో తలదించుకునేట్టు చేయాలి. కాని వారు సగర్వంగా విజయం సాధించినట్టు చెప్పుకుంటున్నారు. జూన్ 29న ప్రజాకోర్టు ముందుకు వచ్చిన కొన్ని వాస్తవాలు ఆరోజు అక్కడున్న వారి చేత కంట తడి పెట్టించాయి. బ్రిటిషర్లు, నిజాం నవాబుల కన్న దారుణమైన రీతిలో ప్రజా ప్రభుత్వం వ్యవహరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి మాత్రమే అరెస్టులు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు వేసే నాడే వేలాది మందిని ఏ కేసూ లేకుండా ఎవరు అరెస్టు చేస్తున్నారో తెలియకుండా నిర్బంధించడం జరిగిపోయింది. ఇక్కడ పోలీసులు హింసతో బూతులతో బూటు కాళ్లతో ఉద్యమంలో పాల్గొన్న నేతలమీద, కార్యకర్తల మీద రాజ్యాంగ నేరాలు సాగించారు. డయ్యర్ బుల్లెట్లతో ప్రాణాలు తీస్తే వందేళ్ల స్వతంత్ర ఉద్యమ చరిత్ర అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం బూట్లతో ఉద్యమాన్ని కాల రాయడం సిగ్గుచేటు. ప్రజాకోర్టులో ప్రజాస్వామ్య ప్రభుత్వం సందేహాతీతం గా దోషి అని రుజువైందని తీర్పు రాసుకోవలసిందే (అసలు కోర్టు తీర్పులకే అమలు దిక్కు లేదు, దీన్నెవరడిగారు?)
[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *