mt_logo

రాయల తెలంగాణ: అనవసరం, అక్రమం

By – ఎన్ వేణుగోపాల్

కాంగ్రెస్ అధిష్ఠానం మళ్లీ ఒకసారి తనకు బాగా తెలిసిన క్రీడ మొదలుపెట్టింది. ప్రజలను వంచించడం, ప్రజలు కోరినదాన్ని ఇవ్వకపోవడం, ప్రజలు కోరనిదాన్ని బలవంతాన వారి గొంతుల్లో కుక్కడం అనే దుర్మార్గమైన క్రీడ అది. ప్రజా ఆకాంక్షల పట్ల కనీసమైన నెనరులేని దుర్మార్గం అది. ఢిల్లీలో అధిష్ఠానానికి సన్నిహితులూ, తెలంగాణ కాంగ్రెస్ నాయకులూ రాయల తెలంగాణ రాబోతుందని గంతులు వేస్తున్నారు. మనం అడిగిందల్లా వస్తుందా, కాస్త అటూ ఇటూగా సర్దుకోవాలి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ తెలంగాణ వ్యతిరేక నిర్ణయాన్ని తెలంగాణ అనుకూలమన్నట్టు నమ్మించడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి రాయల తెలంగాణ అనే ప్రతిపాదన దుర్మార్గమైనది, అనవసరమైనది, ఎవరూ అడగనిది, కుట్రబుద్ధితో ముందుకు తెస్తున్నది, అసాధ్యమైనది. ఈ ప్రతిపాదన ఏదో కొత్తదైనట్టు, అది తెలంగాణ మంచికే వస్తున్నట్టు కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్రంలో నిన్నటిదాకా తెలంగాణ పదం ఉచ్చరించని దళారీల దాకా అందరూ నమ్మబలుకుతున్నారు. కాని శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఆరు అవకాశాల సూచనలలో ఒకటిగా ఈ రాయల తెలంగాణ ప్రతిపాదన ఉండింది. తెలంగాణ సమాజం నిర్ద్వంద్వంగా ఆ ప్రతిపాదనను అప్పుడే ఖండించింది.ఆ ప్రతిపాదనకు ఎం త మాత్రమూ అంగీకరించేది లేదని, విలీనానికి ముందరి తెలంగాణ, చరిత్రకు తెలిసిన తెలంగాణ, హైదరాబాదుతో సహా పది జిల్లాల తెలంగాణ తప్ప మరొక అంగీకారం కాదని తెలంగాణ సమాజం ఎలుగెత్తిన గర్జనకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక చరిత్ర చెత్తబుట్టలో పడిపోయింది. శ్రీకృష్ణ కూడా తలపెట్టలేకపోయిన దుర్మార్గానికి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధపడుతున్నది. కుళ్లిపాడైపోయిన ఆ చద్ది ప్రతిపాదననే పైకి తీసి పోపు పెట్టి మళ్లీ మన ముందర పెడుతున్నది. ఈసారి రాయలసీమ మొత్తం కాదట, దాంట్లోంచి అనంతపురం, కర్నూలు జిల్లాలను విడదీసి తెలంగాణతో కలుపుతారట. ఇది కేవలం ఊహాగానమో, కాంగ్రెస్ పెద్దల బుర్రలో పుట్టిన పురుగో, మరొక వాయిదా ప్రయత్నమో, ఊరికే కొట్టిచూసే ప్రయత్నమో అయితే తెలంగాణ ఏమీ స్పందించనక్కరలేదు. కాని ఒకవేళ ఇటువంటి దుర్బుద్ధే కాంగ్రెస్ పెద్దల మదిని తొలుస్తుంటే, అది మహమ్మారి అయి మిడతల దండులాగ తెలంగాణ ప్రజల మీద వాలక ముందే అది ఎంత దురాలోచనో అర్థం చేసుకోవాలి. బలంగా తిప్పికొట్టాలి. నిష్పాక్షికంగా, కేవలం ఉచితానుచితాల చర్చ చేయదలచినా ఈ రాయల తెలంగాణ ప్రతిపాదన దుర్మార్గమైనదని, అసాధ్యమైనదని తేలిపోతుంది.

మొట్టమొదట, ఈ ప్రతిపాదనకు చరిత్ర వైపు నుంచి ఆమోదయోగ్యత లేదు. రాయలసీమ, తెలంగాణ రెండూ తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలే అయినప్పటికీ, గత రెండు వేల ఏళ్ల చరిత్రలో ఈ రెండు ప్రాంతాలు ఒకే పాలన కింద ఉన్న కాలం రెండువందల ఏళ్లకన్న కాస్త ఎక్కువ మాత్రమే. తెలుగు భాష మాట్లాడే ప్రజలలో అతి ఎక్కువ మందిని పాలించిన శాతవాహనుల కాలంలోగాని, కాకతీయుల కాలంలో గాని ఈ రెండు ప్రాంతాలు ఒకే పాలనలో లేవు. తళ్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యాన్ని దక్కన్ సుల్తాన్ లు ఓడించిన 1565 తర్వాతనే రాయలసీమ ప్రాంతం గోల్కొండ నవాబుల కిందికి, కుతుబ్ షాహి రాజ్యంలోకి వచ్చింది. అలా రెండు ప్రాంతాలు ఒకే పాలనలో దాదాపు 130 ఏళ్లు కొనసాగాయి. ఆ తర్వాత 1724లో అధికారానికి వచ్చిన అసఫ్ జాహీలు 1799లో రాయలసీమను బ్రిటిష్ వారికి దత్తం చేశారు. అందుకే వాటికి దత్తమండలాలు అని పేరు. ఈ చారిత్రక భిన్నత్వం వల్ల రాయలసీమ, తెలంగాణ ప్రజలు తాము ఒకటే అని ఎన్నడూ భావించలేదు. రాయలసీమతో సహా ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణను కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత కూడ ఈ చారివూతక భిన్నత్వమే కొనసాగింది. రాష్ట్ర ఏర్పాటుకు చరిత్రలో ఐక్యత ఏకైక ఆధారంకాదు గాని, ఒక ప్రాంతీయ అస్తిత్వ భావన ఏర్పడడంలో చరిత్రకు ప్రధాన పాత్ర ఉంటుంది. ఇక ప్రాంతీయ అస్తిత్వ స్పృహ విషయానికి వస్తే అటు రాయలసీమ, ఇటు తెలంగాణ కూడ సుదీర్ఘ కాలంగా తమ సొంత, ప్రత్యేక, విశిష్ట అస్తిత్వాలను ప్రకటిస్తున్నాయి. తన ప్రత్యేక అస్తిత్వం గురించి మాట్లాడడానికి తెలంగాణకు చారిత్రక, రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక కారణాలెన్నో ఉన్నాయి. రాయలసీమ కూడ మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు మాట్లాడే కోస్తాంవూధతో కలిసి ఉండి కూడ తన ప్రత్యేక అస్తిత్వాన్ని ప్రకటించింది. తమిళుల ఆధిపత్యంలోని బహుభాషల మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు భాష మాట్లాడేవారి ఐక్యత సాధించడానికి కోస్తాంధ్ర నాయకులు ప్రయత్నించినప్పుడు, కడప కోటిడ్డి, పప్పూరి రామాచార్యులు, కల్లూరి సుబ్బారావు వంటి రాయలసీమ నాయకులు తమ ప్రాంతపు ప్రత్యేక అస్తిత్వం గురించి నొక్కిచెప్పారు. నిజానికి తమ ప్రాంతానికి రాయలసీమ అనే ప్రత్యేకమైన పేరు పెట్టుకోవడం ఈ అస్తిత్వ ప్రకటన నుంచే వచ్చింది.

ఇప్పుడు రాయలసీమలోని నాలుగు జిల్లాలలో రెండిటిని విడదీసి తెలంగాణతో కలిపి కొత్త రాష్ట్రం తయారు చేయడం రెండు ప్రాంతాలనూ వినాశనానికి గురి చేయడమే. తన విశిష్ట అస్తిత్వం పునాది మీదనే తనకొక ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుగుతున్న తెలంగాణ అస్తిత్వం మరొక అస్తిత్వపు ముక్కతో కలిసి వక్రీకరణకు గురి అవుతుంది. ఒక శతాబ్దంగా ప్రత్యేక అస్తిత్వాన్ని ప్రకటిస్తున్న రాయలసీమ గతంలోనే బళ్ళారి ప్రాంతాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు కొత్త ప్రతిపాదనతో ఆ అస్తిత్వమే చిందరవందర అయిపోయి రద్దయిపోతుంది.

ఇక రాజకీయ చరిత్ర చూసినా, వర్తమాన, భవిష్యత్ రాజకీయ సమీకరణాలను చూసినా రాయల తెలంగాణ ప్రతిపాదన ఒక ఉత్పాతానికి కచ్చితమైన మార్గం అని తేలుతుంది. తనకు న్యాయమైన వాటా దక్కకపోవడానికీ, అనేక వాగ్దాన భంగాలకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కారణమని తెలంగాణ దశాబ్దాలుగా వాదిస్తున్నది. ఈ విషాదగాథ మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవడ్డి దగ్గర ప్రారంభమయింది. ఆయన ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న రాయలతెలంగాణలో భాగమైన అనంతపురానికి చెందినవాడు. తెలంగాణకు అన్యా యం చేసిన ఇతర ముఖ్యమంవూతులలో ముగ్గురు చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, ఎన్ కిరణ్ కుమార్‌రెడ్డి ప్రతిపాదిత రాయల తెలంగాణ జిల్లాలకు కాకపోయినా రాయలసీమకు చెందినవారే. ఈ రాజకీయ చరిత్ర వల్ల తెలంగాణ ప్రజల మనసులో రాయలసీమ రాజకీయ నాయకుల పట్ల వ్యతిరేక భావనలున్నాయి. ఈ అనుమానాలు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆంధ్రవూపదేశ్ ఏర్పాటు సమయంలో కూడ ఇటువంటి భయాలూ అనుమానాలూ ఉండేవని, అవే ప్రస్తుత స్థితికి కారణమని గుర్తు ఉంచుకోవాలి. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జన్యుపరమైన లోపాలతో పుట్టింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం ఇప్పుడు కొత్త రాష్ట్రానికైనా జన్యుపరమైన లోపాలు లేకుండా చూడాలి.

కొత్త ప్రతిపాదనకు వ్యతిరేకంగా వస్తున్న హేతుబద్ధ వాదనలన్నిటినీ తొక్కివేసి, అధిష్ఠానం అనుకున్నట్టే రాష్ట్రం ఏర్పరచినా, ఆ 147 స్థానాల శాసనసభలో ఒక విచిత్ర, హాస్యాస్పద స్థితి నెలకొంటుంది. తెలంగాణను సమర్థించిన రాజకీ య పార్టీలకు కొత్త రాష్ట్రంలోని రాయలసీమ ప్రాం తంలో పోటీ చేయడం కష్టమవుతుంది. అలా 28 స్థానాలతో ఆ రెండు జిల్లాలు ఎప్పుడూ మిగిలిన పది జిల్లాలకు పక్కలో బల్లెంలా ఉంటాయి. ఆజిల్లాల శాసనసభ్యులు స్వార్థపరశక్తుల చేతిలో పావులుగా మారి కొత్త రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణకు ఇంతకాలంగా జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి ఏ చర్య ప్రతిపాదించినా వారు అడ్డుకునే అవకాశం ఉంటుంది. అంటే పేరుకు రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ సమస్యలన్నీ యథాతథంగా ఉంటాయి. అంతేకాదు, గత నాలుగేళ్ల ఉద్యమ క్రమంలో ఈ ప్రతిపాదిత జిల్లాల నాయకులే అనంతపురానికి చెందిన జెసి. దివాకర్‌రెడ్డి, ఎస్.శైలజానాథ్, పి.కేశవ్, కర్నూలుకు చెందిన టి.జి ఏరాసు ప్రతాపరెడ్డి వంటివారే తెలంగాణ ఆకాంక్షలను అడ్డుకోవడంలో, తెలంగాణపై నోరు పారేసుకోవడంలో అగ్రభాగాన నిలిచారు. అలా పెరిగిన వ్యతిరేకతలను ఇప్పటికిప్పుడు తీసివేయడం సాధ్యం కాదు.

ఒక కొత్త రాష్ట్రాన్ని ఇటువంటి శత్రుత్వాల మీద రూపొందించడం తప్పనిసరిగా వినాశనానికి దారే. రాయల తెలంగాణ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకిస్తూనే అసలు ఈ ప్రతిపాదనకు కారణమై ఉండగలిగిన రాయలసీమ ఆందోళనలు ఏమిటో కూడా అర్థం చేసుకోవాలి. జలవనరులలో, నగరంలో ఉద్యోగావకాశాలలో తమ వాటా కోల్పోతామనే భయం వారిలో ఉండవచ్చు. కానీ రాయలసీమ నాలుగు జిల్లాలు అటు ఆంధ్రలో కలిసినా, తామే ఒక రాష్ట్రంగా ఏర్పడినా ఈ సమస్యలను పరిష్కరించడానికి, రక్షణలు కల్పించడానికి అంతర్ రాష్ట్ర చర్చలు, కేంద్ర సహకారం ఉంటుంది గనుక భయపడవలసిన అవసరమే లేదు. శ్రీబాగ్ ఒడంబడిక నాటి నుంచీ కోస్తాంధ్ర పెద్దన్నల గురించి రాయలసీమ భయపడుతున్నది గనుక అది నిజమైన సమస్యే కావచ్చు. కానీ మరొకరి గురించిన భయాలకు తెలంగాణకు శిక్ష విధించడం న్యాయం కాదు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *